భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప్రయాణం చాలా ప్రత్యేకం. మైదానంలో ఎల్లప్పుడూ దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ.. తనదైన ఆట తీరుతో భారత క్రికెట్‌ను ఏలినాడనే చెప్పుకోవాలి. టీంఇండియా క్రికెట్ లో సచిన్, గంగూలీ, ధోని.. తరువాత అంతటి క్రేజ్ ఎవరికైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీకే. అలాంటి కింగ్ కోహ్లీని బీసీసీఐ విశ్రాంతి పేరుతో దూరం పెడుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది (2022) జరగనున్న టీ20 ప్రపంచకప్ కారణంగా చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ పేరుతో.. సీనియర్లకు విశ్రాంతినిస్తూ.. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. ఈ క్రమంలో.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గురుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.
యూఏఈ వేదికగా.. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యం అనంతరం పరిస్థితులన్నీ అతనికి ప్రతికూలంగా మారాయి. టీ20 ప్రపంచ కప్ ఓటమి అంత్రం కెప్టెన్ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడం.. వెనువెంటనే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించడం.. సౌతాఫ్రికా సిరీస్ లో ఘోర ఓటమితో టెస్ట్ కెప్టెన్సీని సైతం వదులుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను వదులుకొని, ఒత్తిడి తగ్గించుకున్నప్పటికీ బ్యాటింగ్‌లో మునపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. అడపాదడపా హాఫ్ సెంచరీలు బాదుతున్నా.. అవి అతని స్థాయికి తగినవిగా కనిపించడం లేదు. గత రెండేళ్లుగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ముందులా రాణిస్తేనే జట్టులో స్థానం.. లేకుంటే వేటు తప్పదన్నట్లు టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి సంకేతాలున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి దగ్గరలో టీ20 టోర్నీలు లేనప్పటికి.. రానున్న ఐపీఎల్ టోర్నీ అతని కెరీర్‌కు కీలకం కానుంది.
గత ఏడాది వరకు.. టీమిండియాలో నంబర్ 3 ఆటగాడు ఎవరు అంటే.. విరాట్ కోహ్లీనే. కానీ ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఆ స్థానానికి తాము కూడా పోటీలో ఉన్నామంటూ.. అద్భుతంగా రాణిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్‌తో రెచ్చిపోతున్నారు. గతేడాది శ్రేయాస్ అయ్యర్ గాయపడటం వల్ల అవకాశం దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే.. సూర్య కుమార్ యాదవ్.. జట్టులో ఏ స్థానంలోనైనారాణించగల సమర్థుడు.
ఇక శ్రేయాస్ అయ్యర్.. రాణించడం పక్కన పెడితే.. అవుట్ చేయండి చాలు అంటున్నాడు. తాజాగా శ్రీలంకతో ఆడిన టీ20 సిరీసే అందుకు నిదర్శనం. మూడు మ్యాచ్‌ల్లోనూ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్ వరుస అర్ధ సెంచరీలతో (57, 74, 73) దుమ్మురేపాడు. ఈ సిరీస్‌లో మొత్తం 174 స్ట్రైక్ రేటుతో 204 పరుగులు చేసిన శ్రేయస్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు’ గెలుచుకున్నాడు. ప్రస్తుతం.. ఈ ఇద్దరి యువ ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే..రానున్న ఐపీఎల్‌లో చెలరేగేలా కనిపిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోగా.. శ్రేయాస్ అయ్యర్ ను కేకేఆర్ వేలంలో దక్కించుకుంది.
ఈ మధ్యనే అయ్యర్ సైతం తన మనుసులో మాటను బయటపెట్టాడు. నంబర్ 3లో ఆడటం చాలా ఇష్టమని వెల్లడించాడు. తన మాటలు, ఆటతో.. కోహ్లీ స్థానానికే ఎసరు పెట్టాడంటున్నారు కోహ్లీ వ్యతిరేక వర్గం. టీమిండియా మేనేజ్‌మెంట్ సైతం యువ ఆటగాళ్లకే అవకాశాలివ్వాలని భావిస్తోంది. వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌ల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. ఎన్నిప్రయోగాలు చేసినా.. ఐపీఎల్ తరువాతనే వరల్డ్ కప్ ఎంపిక ఉంటుంది కావున.. ఈ ఐపీఎల్ లో కోహ్లీ చెలరేగడం ఖాయమంటున్నారు కోహ్లీ అభిమానులు. కోహ్లీకి ఎవరు పోటీ రారని.. తనకుతానే పోటీ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు కోహ్లీ ఫాన్స్.