టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలను భారత జట్టు ధాటిగానే ప్రారంభించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచులో మనం గెలిచాం.. అనడం కంటే వాళ్లే గెలిపించారు అనొచ్చు. చివరి వరకు విజయం ఆసీస్ వైపే ఉన్నా.. ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారయ్యింది. అయితే ఈ మ్యాచులో విజయం సాధించి గాడిలో పడ్డాం అనుకుంటుండగానే మరో బ్యాడ్ న్యూస్ వినపడుతోంది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్ లో అతడు గాయపడ్డట్టు సమాచారం.
ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లేని లోటు జట్టుకు తలకు మించిన భారమవుతోంది. వీళ్లకు తగ్గ ఆటగాళ్లు లేకపోయినా ఉన్నవాళ్లతోనే ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఇప్పుడు పంత్ గాయపడ్డాడన్న వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వామప్ మ్యాచులో బరిలోకి దిగని పంత్ మోకాలికి కట్టుతో కనిపించాడు. మోకాలిపై ఐస్ ప్యాక్ తో డగౌట్ లో కూర్చున్న అతడి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్.. కంగారూ పడిపోతున్నారు. పంత్ గనుక జట్టుకు దూరమైతే జట్టుకు భారీ ఎదురుదెబ్బేనని కామెంట్లు చేస్తున్నారు.
Hope Rishabh pant is fit 🥺🙏 pic.twitter.com/jZTOee4X1K
— Rishabh pant fans club (@rishabpantclub) October 17, 2022
అయితే, మరికొందరు మాత్రం రిలీఫ్ కోసమే పంత్ ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి దినేష్ కార్తీక్ ను ఆడిస్తున్నా.. ఒకటి, రెండు మ్యాచుల్లో గనుక డీకే విఫలమైతే పంత్ కు తప్పక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పంత్ గనక దూరమైతే సంజూ సాంసన్ ను ఆస్ట్రేలియా పిలిపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆసీస్ తో వామప్ మ్యాచ్ గెలిచిన భారత జట్టు.. తదుపరి మ్యాచులో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరోవైపు.. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ వార్మప్ మ్యాచ్ లో అదరగొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆఖరి ఓవర్ లో 11 పరుగులు అవసరం కాగా, 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.