టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన టీమిండియా.. మ్యాచ్ కి ముందు అక్కడ ఓ హోటల్ లో బస చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భారత్ రెండు మ్యాచ్ లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజాకి గాయమైంది. దీంతో ఆసియా కప్ నుండి హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. భారత్ జట్టులో జడేజా లేకపోవడంతో.. జడేజా స్థానంలో సరైన ఆటగాడ్ని భర్తీ చేయలేకపోయారు. ఈ కారణంగా భారత్ ఆసియా కప్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఓటమిని బీసీసీఐ.. రవీంద్ర జడేజా అండ్ కో మీద వేసే ప్రయత్నాలు చేస్తోంది.
‘Unhappy’ BCCI admonish Ravindra Jadeja for irresponsibility towards fitness and health ahead of World Cup https://t.co/2h9NDDEKnn
— TOI News – TOI.News – Latest News, Breaking News (@TOINewsOfficial) September 10, 2022
ఇప్పటివరకూ జడేజాకి గాయమైందన్న వార్త మాత్రమే బయటకు వచ్చింది. అయితే తాజాగా ఆ గాయం ఎలా అయ్యిందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ వర్గాలు ప్రకారం.. ఆ గాయం రవీంద్ర జడేజా సొంత తప్పిదం వల్ల జరిగిందని తెలుస్తోంది. మ్యాచ్ కి ముందు జడేజా.. స్కి-బోర్డు అనే సాహసోపేతమైన ఒక ఆట ఆడినట్టు బీసీసీఐ కనిపెట్టింది. సముద్రంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొన్న జడేజా.. స్కి-బోర్డు నుంచి జారిపడడంతో మోకాలు మెలి తిరిగింది. అది సర్జరీకి దారి తీయడంతో ముంబైలోని హాస్పిటల్ లో బీసీసీఐ కన్సల్టెంట్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా సమక్షంలో సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు జడేజా పై బీసీసీఐ నిప్పులు చెరుగుతుంది.
ముఖ్యమైన, ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్ ఉందన్న ఆలోచన లేకుండా ఈ స్కి-బోర్డు యాక్టివిటీ అవసరమా అంటూ బీసీసీఐ ప్రశ్నలు సంధిస్తోంది. టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాడు ఇలాంటి పనులు చేయొచ్చా? అంటూ మండిపడినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ విషయంలో.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపై కూడా బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జడేజా త్వరలో కోలుకుని తిరిగి టీమ్ లో చేరతానని చెప్పినప్పటికీ.. అతనికి తగిలిన గాయం అంత చిన్నది కాదని బీసీసీఐ అభిప్రాయపడుతోంది.
గాయం కూడా విచిత్రంగా ఉందని బీసీసీఐ భావిస్తున్న కారణంగా ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కి జడేజా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బీసీసీఐ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే భారత్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీసీసీఐ భావిస్తుంది. మరి ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో జడేజా ఆడే అవకాశం ఉందా? లేదా? జడేజా లేకుండా భారత్ గెలుస్తుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.