ప్రస్తుతం టీమిండియా అంతర్జాతీయ టూర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఒక జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని మరోజట్టు ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి జోష్ మీదుంది. అయితే ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఒకే ఒక విషయం.. అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారు? అవును ఒక్క క్రికెట్ అభిమానులే కాదు.. అటు నిపుణులు, మాజీలు సైతం అదే ప్రశ్న లేవనెత్తుతున్నారు. అయితే జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ మాత్రం కఠిన నిర్ణయాలు సైతం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జట్టు విషయంలో బీసీసీఐ ఎంపిక విధానం అర్థం కాక కొంతమంది జుట్టుపీక్కుంటున్నారు. ఇంకో నాలుగు నెలలలోపే ప్రపంచ కప్ పెట్టుకుని అన్ని మ్యాచ్‌లకు కుర్రాళ్లను ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే గంగూలీ, ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకున్నవారు మాత్రం మెచ్చుకుంటున్నారు. అయితే ఈ ప్రణాళిక వెనుక ఇంకో పెద్ద కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్ కు వెళ్లాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
2021 వరల్డ్ కప్ నుంచి అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతమవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ 2022 సీజన్లోనూ ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు వాళ్లను నమ్ముకుని టీ20 వరల్డ్ కప్ కు వెళ్లే యోచనలో బీసీసీఐ లేదనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అందులో భాగంగానే.. ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన ఇషాన్ కిషన్ కు మళ్లీ అవకాశం కల్పించి.. అతను తిరిగి ఫామ్ అందుకునేలా చేయడం, దీపక్ హుడాలాంటి ప్లేయర్ టాప్ ఆర్డర్ లో ఆడించినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ చేస్తున్న ఆలోచనను మాజీలు, నిపుణులు సైతం సమర్థిస్తున్నారు. మరోవైపు జట్టులో టాప్ ఆర్డర్ కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్లు ఉండగా.. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రోహిత్, కోహ్లీకి స్థానం కల్పించేందుకు యాజమాన్యం సైతం సిద్ధంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటన నుంచే ద్రవిడ్.. ప్రపంచకప్ జట్టు ఎంపిక మొదలు పెడతాడని ఇప్పటికే వెల్లడించారు. కరోనా కారణంగా రోహిత్ ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. అటు కోహ్లీ కూడా ఈ పర్యటనలో విఫలమైతే ఇంక పక్కాగా వారిని తప్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. కోహ్లీ, రోహిత్ లేకుండానే ప్రపంచకప్ కు వెళ్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.