వచ్చే వరల్డ్ కప్, ఆసియా కప్ ను దృష్టిలో పెట్టకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు టీమిండియా ఆటగాళ్ల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తెలిసిన అభిమానులు దేశం కోసం మంచి నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ హడావుడే కనిపిస్తోంది. ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ బహుశా అంతర్జాతీయ మ్యాచులకు కూడా ఉండదేమో అనిపిస్తుంది. అయితే ఈ సారి ఐపీఎల్ కి భారత ఆటగాళ్లు గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కారణం ఈ ఏడాది మన టీం రెండు ఐసీసీ ఈవెంట్లు ఆడాల్సి రావడమే. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ ఉండడంతో ఇదే విషయమే ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. టీంఇండియా ప్లేయర్లు ఫ్రాంచైజీల కోసం ఐపీఎల్ తప్పక ఆడాలి. అదే సమయంలో ఐపీఎల్ తర్వాత ఐసీసీ టోర్నీలు ఉన్నందున ప్లేయర్లకు తగిన విశ్రాంతితో పాటు గాయాలు కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఇలా ఈ రెండిటిని హ్యాండిల్ చేయాలంటే ప్లేయర్లకు కత్తిమీద సామే. అయితే ఈ విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్లేయర్లకు అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్నారు.
ఇప్పుడు టీమిండియాకి గాయాల సమస్య బాగా వేధిస్తుంది. ఇప్పటికే బుమ్రా ,పంత్ , శ్రేయాస్ అయ్యర్ లాంటి కీలక ప్లేయర్లు గాయాలతో ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి, ఆ తర్వాత ఆసియా కప్ కి కూడా దూరం అయ్యారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే వరల్డ్ కప్ లో కూడా వీరు ఆడడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ ముగ్గురు భారత జట్టుకి మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్లు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లాంటి టోర్నీ ఉండడంతో గాయాలతో మరి కొంతమంది కీలక ప్లేయర్లు ఐసీసీ టోర్నీలకు దూరమైతే టీమిండియా పరిస్థితి ఏంటి ?అనే ఆలోచన ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.
మీ ఐసీసీ టోర్నీలతో మాకు సంబంధం లేదు మా టీంకి టైటిల్ అందించడమే ముఖ్యం. ఇప్పటివరకు ఐపీఎల్ ఫ్రాంచైజీల తీరు ఇలాగే కొనసాగింది. పైకి చెప్పకపోయినా ఎవరి స్వార్ధం వారిది అనేట్లుగా మారిపోయింది లోకం. అటు ఇండియన్ ప్లేయర్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలుకి న్యాయం చేయాలా? ప్రపంచ కప్ కి సన్నద్ధమవ్వాలా ? అనే డైలమాలో ఉంటే.. బీసీసీఐ, ఐసీసీ టోర్నీలని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ని ఆపలేని పరిస్థితి. ఈ విషయంలో అటు ప్లేయర్లు, ఇటు బీసీసీఐ ఏమి చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకొని టీమిండియా ప్లేయర్లకు ఒక కీలక సూచన చేశాయి.
దీని ప్రకారం ఇండియన్ బౌలర్లను నెట్స్ లో ఎక్కువగా బౌలింగ్ చేయొద్దు అని చెప్పింది. ప్రాక్టీస్ టైములో ఇలా ఎక్కువగా బౌలింగ్ చేయడం వలన ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. నిజంగా ఫ్రాంచైజీలు వరల్డ్ కప్ గురించి ఆలోచించి ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందరిని కాస్త ఆశ్చర్యపరిచినా.. ఈ విషయంలో మాత్రం వీరికి మనం హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. తమ లెక్కలను పక్కన పెట్టేసి ఇలా దేశం కోసం ఆలోచించడం ఇప్పుడు అభిమానులతో పాటుగా ప్లేయర్లకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.