ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది? దాని బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గింది ముంబై. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్.. గత సీజన్‌లో మాత్రం వరుస ఓటముల చెత్త రికార్డు సృష్టించి దారుణంగా నిరాశపర్చింది. ముంబై నుంచి అలాంటి ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. అయితే గతేడాదిని ఓ పీడ కలల మర్చిపోయి.. ఈ సీజన్‌లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇప్పటికే రోహిత్ శర్మ ప్రకటించాడు. ఐపీఎల్ 2023 మినీ వేలం తర్వాత తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు. మరి ఐపీఎల్ 2023 సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జట్టు బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బ్యాటింగ్..
ఐపీఎల్ 2023లో ముంబై ప్రధానంగా బ్యాటింగ్ బలంపైనే ఆధారపడి బరిలోకి దిగుతుందని చెప్పుకోవచ్చు. యువ సంచలనం ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. వీరిద్దరి రూపంలో ముంబైకి బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. ఇక మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం సూర్య వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా నయా స్టార్లు కామెరున్ గ్రీన్, టిమ్ డేవిడ్ సైతం ముంబైలో ఉండటం ఆ జట్టు బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచేసింది. వీరితో పాటు యువ క్రికెటర్లు డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, స్టబ్స్‌తో ముంబై బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది.
బౌలింగ్..
బ్యాటింగ్‌తో పోల్చుకుంటే ముంబై బౌలింగ్ ఎటాక్ అంత పటిష్టం లేదు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కావడం ముంబైకి అతిపెద్ద దెబ్బ. చాలా కాలంగా ముంబై పేస్ ఎటాక్‌ను బుమ్రా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు బుమ్ర ఆ జట్టులో లేకపోవడం ముంబైని కచ్చితంగా ఇబ్బంది పెట్టే విషయమే. అయితే.. బుమ్రా స్థానాన్ని ఈ సారి ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ తీసుకోకున్నాడు. ఆర్చర్, గ్రీన్, పీయూష్ చావ్లా, కార్తీకేయ బౌలింగ్‌లో కాస్త వెల్‌నోన్ ఫేసులుగా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ముంబై బలం మొత్తం బ్యాటింగ్‌లోనే ఉంది.
బలం, బలహీనత..
ముంబై బలం మొత్తం బ్యాటింగ్‌పై ఆధారపడి ఉంది. ఈ సీజన్‌లో ముంబై మంచి ప్రదర్శనలు చేయాలంటే అది బ్యాటర్లను రాణిస్తేనే జరుగుతుంది. అంతేకానీ బౌలింగ్‌పై ఆధారపడి, తక్కువ స్కోర్‌తో బరిలోకి దిగితే ముంబైకి మరోసారి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అయితే దుర్బేధ్యమైన బ్యాటింగ్ బలం ముందు.. బౌలింగ్ బలహీనతను కప్పిపుచ్చాలని ముంబై భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాటింగ్ బలంతో పాటు ముంబైకి మరో ప్లస్ పాయింట్ రోహిత్ శర్మ కెప్టెన్సీ.. ఫీల్డ్ సెట్టింగ్‌లో రోహిత్ స్ట్రాటజీలు ఐపీఎల్‌లో అద్భుతంగా వర్క్ అవుట్ అవుతాయి. ఈ సారి కూడా రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్ వర్క్ అవుట్ అయితే.. ముంబైకి తిరుగుండదు.
🥶🥶🥶#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @ImRo45 @JofraArcher @surya_14kumar pic.twitter.com/R6AkelwqJk
— Mumbai Indians (@mipaltan) March 29, 2023