చేతిలో ఇంకా 8 వికెట్స్ ఉన్నాయి. అప్పటికి కెప్టెన్ రాహుల్ క్రీజ్ లోనే ఉన్నాడు. స్టోయినిస్, పూరన్ వంటి ఫినిషర్ వెనుక ఉండనే ఉన్నారు. ఇలా రెండు ఓవర్లు ముందుగానే మ్యాచ్ ముగిసిపోద్దని అంతా అనుకుంటుండగా...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ లు ఊహకి అందని విధంగా సాగుతున్నాయి. చివరి ఓవర్ లో 30 పరుగులు చేసి కొన్ని టీమ్స్ విజయాలు సాధిస్తుంటే.., కొన్ని టీమ్స్ మాత్రం చేతిలో ఉన్న విజయాన్ని ప్రత్యర్ధులకు ఇచ్చేసి క్రికెట్ వీక్షకులకు షాక్ ఎక్కిస్తున్నాయి. ఇలా ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగుతూ ఉండటం, ఫలితం కూడా అనూహ్యంగా మారుతూ ఉండటంతో ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై సోషల్ మీడియాలో ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఒత్తి పుకార్లే అయినప్పటికీ.. తాజాగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అందరికీ షాక్ ఇచ్చింది.
నేటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది. గుజరాత్ టీమ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిసినా, ఓపెనర్ సాహ మంచి ఇన్నింగ్స్ ఆడినా స్కోర్ బోర్డుని మాత్రం పరుగులు పెట్టించలేకపోయారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో.. లక్నో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం పక్కా అని అంతా అనుకున్నారు. లక్నో టీమ్ లో కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ వంటి పవర్ హిట్టర్స్ ఉండటం ఇందుకు కారణం. దీనికి తగ్గట్టుగానే తొలుత లక్నో ఇన్నింగ్స్ మొదలైంది కూడా. కానీ.., తరువాత అసలు డ్రామాకి తెర లేసింది.
పవర్ ప్లే ముగిసే సమయానికి లక్నో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 50కి పైగా పరుగులు సాధించింది. రిక్వైడ్ రన్ రేట్ కూడా 6 కన్నా తక్కువకి వచ్చేసింది. ఆ తరువాత కైల్ మేయర్స్ రూపంలో తొలి వికెట్ పడ్డా.. రాహుల్, కృనాల్ పాండ్యా మధ్య మంచి పార్టనర్ షిప్ నెలకొంది. పాండ్యా స్లోగా ఆడినప్పటికీ.. అతను అవుట్ అయ్యే సమయానికే లక్నో టీమ్ పటిష్ట స్థితిలోకి వచ్చేసింది. ఇక చివరి 5 ఓవర్లో లక్నో గెలుపుకి 30 పరుగులు అవసరం అయ్యాయి. చేతిలో ఇంకా 8 వికెట్స్ ఉన్నాయి. అప్పటికి కెప్టెన్ రాహుల్ క్రీజ్ లోనే ఉన్నాడు. స్టోయినిస్, పూరన్ వంటి ఫినిషర్ వెనుక ఉండనే ఉన్నారు. ఇలా రెండు ఓవర్లు ముందుగానే మ్యాచ్ ముగిసిపోద్దని అంతా అనుకుంటుండగా ఒక్కసారిగా లక్నో టీమ్ చప్పపడిపోయింది. బౌండరీస్ కొడితే ఒప్పుకోము అని ఎవరో హెచ్చరించిన చందనా.. అసలు రన్స్ చేయడానికే ఆ టీమ్ బ్యాటర్స్ వణికిపోయే స్థితికి వచ్చేశారు.
లక్నో విజయానికి చివరి 2 ఓవర్స్ లో 17 పరుగులే అవసరం అయ్యాయి. కానీ.., రాహుల్ స్లో బ్యాటింగ్ తో షమీ వేసిన 19వ ఓవర్ లో 5 పరుగులే లభించాయి. దీంతో.. చివరి ఓవర్ లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగులు చేయాల్సి వచ్చింది. అంతగా టచ్ లో లేని మోహిత్ శర్మ బౌలింగ్ కి రావడంతో లక్నోదే విజయం అని అంతా భావించారు. కానీ.., ఊహకి అందని క్లైమ్యాక్స్ డ్రామా ఇక్కడ నుండే మొదలైంది. 9వ ఓవర్ మొదటి బంతికి రెండు పరుగులు రాగా, తరువాతి 4 బంతులకి 4 వికెట్లు పడ్డాయి. అందులో రెండు రనౌట్స్ కూడా!
ఎక్కడ రన్స్ కొడితే టీమ్ గెలిచేసుద్దో అనే రీతిలో.. లక్నో బ్యాటర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో.. ఏ స్క్రిప్ట్ కి కూడా అందని రీతిలో లక్నో సూపర్ జెయింట్స్ దారుణ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లో రాహుల్ స్లో బ్యాటింగ్ పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైపోయింది. ఈ గెలుపుతో గుజరాత్ రెండు పాయింట్స్ దక్కించుకుని పాయింట్స్ టేబుల్ లో నాలుగవ స్థానానికి చేరుకుంది. మరి.. గెలవాల్సిన మ్యాచ్ లో దారుణంగా ఓడిన లక్నో జట్టుపై, ఈ ఐపీఎల్ జరుగుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.