మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి తొలుత పాజిటివ్ గా తేలగా.. ఆ తర్వాత కేసులు ఒక్కోక్కటిగా బయటపడడంతో లీగ్ ను మధ్యలోనే ఆపేసి.. సుదీర్ఘ విరామం తర్వాత దుబాయ్ లో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అలాంటి పరిస్థితులు పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా.. బీసీసీఐ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఈ ఏడాది లీగ్‌ను మహారాష్ట్రకే పరిమితం చేసిన బీసీసీఐ.. అత్యంత పకడ్బందీగా టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో.. బయోబబుల్ బ్రేక్ చేసే ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, టీమ్ అఫిషియల్స్ పై కఠిన చర్యలు తీసుకోనుంది. ఎవరైనా ఆటగాడు తొలిసారి బబుల్ నిబంధనలు అతిక్రమిస్తే అతన్ని మరోసారి ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు ఈ టైమ్‌లో మిస్సైన మ్యాచ్‌లకు చెల్లించాల్సిన డబ్బులను కోత పెట్టనుంది. రెండోసారి చేస్తే ఏడు రోజుల క్వారంటైన్ అనంతరం ఒక మ్యాచ్ నిషేధించడంతో పాటు ఆ సమయంలో మిస్సైన మ్యాచ్‌లకు డబ్బులు చెల్లించరు. ఇక మూడో సారి బ్రేక్ చేస్తే లీగ్ నుంచి గెంటేయనున్నారు. ఒకవేళ.. ఈ పరిస్థితి ఎదురైతే, ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించరని పేర్కొంది.ఇక, ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరైనా ఆటగాడు/ ఫ్రాంచైజీ సభ్యుడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ. కోటి జరిమానా, రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబబుల్ నిబంధనలు ఫ్రాంచైజీలు, సభ్యుల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని.. కుటుంబ సభ్యుల మొదటి ఉల్లంఘనకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ (ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్‌లో గడపాల్సిందే), రెండోసారి బ్రేక్ చేస్తే సదరు కుటుంబ సభ్యుడిని బబుల్ నుంచి గెంటేస్తారు. సదరు ప్లేయర్‌ను మాత్రం ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో మిస్సైన మ్యాచ్‌లకు డబ్బులు ఇవ్వరు.
ఇది కూడా చదవండి: అఫిషియల్: IPLలోకి సురేష్ రైనా రీఎంట్రీ!
ఏదైనా జట్టు.. మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడితే.. ఆ రోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం. దీంతో పాటు కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు, రెండోసారికి రూ. 75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి ఉండదని బీసీసీఐ పేర్కొంది.
Strict Corona rules in #IPL2022 : 7 days quarantine for breaking bio bubble for the first time, ban of one match in second time and out of tournament for third time pic.twitter.com/zHUf5RvwMt
— kabaddi fan club (@kabaddifanclub1) March 17, 2022