ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై బహుమతుల వర్షం కురుస్తూనే ఉంది. వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మీరాబాయే. రైల్వే శాఖ 2 కోట్లు, మణిపూర్ ప్రభుత్వం కోటి క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించాయి. ఇక తనకు పిజ్జా అంటే ఇష్టమని ఆమె చెప్పగానే ‘లైఫ్‌టైమ్ ఫ్రీ’ గా పిజ్జాలు ఇస్తామని డొమినోస్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా.
గతంలో పిజ్జాను చాలాకాలంగా తినలేదని ఇది తినాలని కోరుకుంటున్నట్లు మీరాబాయి చాను వెల్లడించారు. దీంతో పతకం గెలిచిన వెంటనే డొమినోస్ ఇండియా ఆ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలోకి ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వచ్చింది. ఇకపై మీరాబాయి జీవితకాలం ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తామని ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ ప్రకటించింది.
ఒక్క మీరాబాయికే కాకుండా ఈ ఒలింపిక్స్‌లో మెడల్‌తో దేశానికి వచ్చే ప్రతీ ఒక్క ప్లేయర్‌కు ఈ ఆఫర్ అందిస్తామని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ప్రతి అథ్లెట్‌కు ఏడాదిపాటు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామని ఐనాక్స్ ప్రకటించడం విశేషం.
దేశంలో ఐనాక్స్‌కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో ఐనాక్స్ తెలిపింది.