సుదీర్ఘ విరామం అనంతరం భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతుండగా.. కొత్త కుర్రాళ్లు జట్టులో చోటు కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. మరి వారిలో ఎవరికి అవకాశం దక్కుతుందో!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా కనిపించిన కామెంట్‌లో నిజం లేకపోలేదనిపిస్తోంది. ‘ఆస్ట్రేలియా లాంటి జట్టు చేతిలో పరాజయం మరిచిపోవాలంటే మనవాళ్లు వెస్టిండీస్‌తో సిరీస్ ఆడాల్సిందే’ ఇది ఆ కామెంట్ అంతరార్ధం. అంటే చిన్న జట్లపై, సొంతగడ్డపై పులిలా విజృంభించే టీమ్‌ఇండియా.. అసలు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేదు అని డైహార్ట్ ఫ్యాన్స్ సైతం రోహిత్ సేనపై ట్రోలింగ్‌కు దిగారు. అనుకున్నట్లే.. డబ్లూ్యటీసీ ఫైనల్ అనంతరం భారత ఆటగాళ్లకు నెల రోజుల విరామం లభించగా.. ఇప్పుడు కరీబియన్ గడ్డపై సత్తాచాటేందుకు మనవాళ్లు సిద్ధమవుతున్నారు. గతమెంతో ఘనం అన్నట్లు చరిత్ర చెప్పుకొని కాలం గడుపుతున్న విండీస్ జట్టు నానాటికీ తీసికట్టులా మారుతోందనేది కాదనలేని సత్యం.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీ20 లీగ్‌లు జరిగినా.. వాటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే వెస్టిండీస్ ప్లేయర్లు.. జాతీయ జట్టు తరఫున మాత్రం కలిసి కట్టుగా ఆడిన దాఖలాలు లేవు. అడపాదడపా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడటం లీగ్‌ల్లో భారీ ధర చేజిక్కించుకోవడం విండీస్ వీరులకు అలవాటుగా మారింది. ఎంతో సత్తా ఉన్న ప్రధాన ఆటగాళ్లు అసలు దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకే ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం విండీస్ క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అందులో ముగ్గురు, నలుగురు తప్పా మిగిలిన వాళ్లంతా మనకు దాదాపు తెలియనివాళ్లే. మరి టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉన్న భారత్‌ను ఈ కరీబియన్ కొత్త కుర్రాళ్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి.
పిచ్ పరిస్థితులను బట్టి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకుంటామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రకటించగా.. రెండు, మూడు స్థానాలకే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయం కాగా.. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఖాళీ చేసిన మూడో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరం. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరికి ఈ ప్లేస్ దక్కొచ్చు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీల్లో యశస్వి దుమ్మురేపుతుంటే.. ఇప్పటికే వన్డే అరంగేట్రం చేసిన రుతురాజ్‌కు అనుభవం కలిసొస్తుందా చూడాలి. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అజింక్యా రహానే బ్యాటింగ్‌కు రానున్నారు. వికెట్ కీపర్‌గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్‌తో ఇషాన్ కిషన్ పోటీపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బరిలోకి దిగిన భరత్ వికెట్ల వెనుక అదుర్స్ అనిపించుకున్నా.. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే మరోసారి భరత్‌పైనే విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశిన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కించుకోనుండగా.. ప్రధాన పేసర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌తో పాటు కొత్త బంతిని పంచుకునేది ఎవరో తేలాల్సి ఉంది. నవ్‌దీప్ సైనీ, జైదేవ్ ఉనాద్కట్, ముఖేశ్ కుమార్.. ఈ ప్లేస్ కోసం పోటీపడుతుండగా.. వారిలో ముఖేశ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.
వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు భారత జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి, కోహ్లీ, రహానే, భరత్, జడేజా, అశ్విన్, శార్దూల్, సిరాజ్, ముఖేశ్.