టీ20 వరల్డ్ కప్ 2021 నుంచి టీమిండియా నిష్ర్కమించింది. సోమవారం నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఆడేసి భారత్‌కు తిరుగుపయణం అవ్వనుంది. మొదట రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో సెమీస్ అవకాశలు సంక్లిష్టంగా మార్చుకున్న టీమిండియా ఆతర్వాత రెండు మ్యాచ్‌ల్లో పసికూనలపై తన పంజా విసిరి.. ఇతర జట్ల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. కాకపోతే న్యూజిలాండ్ ఇండియాకు ఆ అవకాశం ఇవ్వకుండా అఫ్గానిస్తాన్‌పై సునాయసంగా విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక టీమిండియా జడేజా చెప్పినట్లు బ్యాగులు సర్దుకోవడమే మిగిలింది. కాకపోతే ఈ టోర్నీలో టీమిండియా కొన్ని రికార్డులు మాత్రం నెలకొల్పి పరువు నెలబెట్టుకుంది. టోర్నీ సక్సెస్ అయినా జట్లు కూడా అందుకోలేని రికార్డులను లిఖించింది. అవేంటో తెలుసుకుందాం..
అత్యధిక పరుగులు..
పాక్, న్యూజిలాండ్‌తో ఓటమితో పరాభవ భారంతో రగిలిపోతున్న టీమిండియా కోపానికి పాపం ఆఫ్ఘనిస్తాన్ బలైంది. రెండు మ్యాచ్‌లు ఓడి సెమీస్ ఆశలు ఆవిరి అవుతున్న క్షణంలో టీమిండియా ఓపెనర్లు ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 210 పరుగులు చేసింది టీమిండియా. ఇప్పటి వరకు ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇదే అత్యధిక టోటల్. టీమిండియా బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించిన మ్యాచ్ ఇది. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ రషీద్ ఖాన్‌తో బలమైన బౌలింగ్ ఆయుధంగా జట్టుపై టీమిండియా ఈ రికార్డు కొట్టింది.
ఫాస్టెస్స్ ఫిఫ్టీ..
ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్స్ ఫిఫ్టీ కూడా టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిటే ఉంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించాల్సిన తరుణంలో చిన్న టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 18 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి కేఎల్ రాహుల్‌తో సమానంగా నిలిచాడు.
హైయస్ట్ రన్స్ ఇన్ పవర్‌ప్లే..
టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 5న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. 86 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించారు. దీంతో పవర్ ప్లే(మొదటి 6 ఓవర్లు) అత్యధిక పరుగులు 82 చేశారు. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో ఏ జట్టు కూడా పవర్‌ప్లేలో ఇన్ని పరుగులు చేయలేదు.
సెకండ్ హైఎస్ట్ పార్ట్నర్‌షిప్..
అలాగే ఈ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వాయ్యం నెలకొల్పిన రెండో జోడి టీమిండియాదే. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మొదటి వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు.
బిగెస్ట్ విన్..
సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. పసికూనపై పూర్తి ప్రతాపం చూపిస్తూ అవసరమైన భారీ విజయం కంటే అతి భారీ గెలుపును నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రన్‌రేట్‌ను దాటి మన రన్‌రేట్ మెరుగు పడాలంటే స్కాట్లాండ్ నిర్దేశించిన టార్గెట్‌ను 7.2 ఓవర్లలో ఛేదించాల్సి ఉండగా కేవలం 6.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను ఊదేసి భారీ విజయం నమోదు చేసుకుంది. దాంతో పాటే ఆ మ్యాచ్‌కు ముందుకు ఉన్న +0.073 ఉన్న రన్‌రేట్ ఏకంగా +1.619 చేరింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇంతటి భారీ గెలుపు సాధించిన జట్టు టీమిండియానే. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ చేరలేదనే నిరాశలో ఉన్న భారత్ క్రికెట్ అభిమానలకు ఈ రికార్డులు కాస్త ఊరటనిస్తున్నాయి. మరి టీమిండియా సాధించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.