ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఒక అరుదైన రికార్డ్ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మొదటి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి గతంలో ఈ ఘనత సాధించిన జిమ్‌లేకర్, అనిల్‌కుంబ్లే సరసన నిలిచాడు. ఇంతటి ఘనత సాధించిన అజాజ్ పటేల్‌ను టీమిండియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి చాటుతూ మనస్ఫూర్తిగా అభినందించారు.
టీమిండియా ఆటగాళ్లంతా టీమిండియా జెర్సీపై సంతకాలు చేసి అజాజ్‌కు బహుమతిగా అందించారు. అరుదైన జెర్సీని అజాజ్ అంతే ఆనందంగా అందుకున్నాడు. అజాజ్ పదో వికెట్ తీసిన సమయంలో నిల్చుని మరీ చప్పట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్‌ను అభినందించిన అశ్విన్ చేతుల మీదుగా జెర్సీ అందుకున్నాడు అజాజ్. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఏకంగా 372 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసుకుంది.