క్రికెట్ ప్రపంచంలో పసికూనగా ఉన్న ఐర్లాండ్‌పై భారత టీమ్ బీ లాంటి జట్టు సత్తా చాటింది. వర్షం కారణంగా టీ20 మ్యాచ్ కాస్త టీ12 మ్యాచ్‌గా కుదించారు. ఈ మ్యాచ్‌ను టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 12 ఓవర్ల మ్యాచ్ కనుక ఒక మంచి టార్గెట్‌నే ఐర్లాండ్ భారత్ ముందు ఉంచింది. కానీ టీమిండియా కేవలం 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. మరో ఓపెనర్ దీపక్ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. ఓపెనర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. హుడా, పాండ్యా మూడో వికెట్‌కు చకచకా 64 పరుగులు జోడించారు. హార్దిక్ అవుటయ్యాక దినేశ్ కార్తీక్ (5 నాటౌట్)తో కలిసి హుడా మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ను భారత సీమర్లు హార్దిక్, భువనేశ్వర్, అవేశ్ టాపార్డర్‌పై తలా ఒక దెబ్బ వేశారు. దీంతో ఓపెనర్లు స్టిర్లింగ్ (4), బల్బిర్నీ (0) సహా గ్యారెత్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో ఐర్లాండ్ 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒంటరిగా పోరాటం చేశాడు. టక్కర్ (18; 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డాక్ రెల్ (4)తో కలిసి జట్టు స్కోరును వంద దాటించాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌కు కేవలం ఒకే ఓవర్ వేసే అవకాశం దక్కింది. ఒకే ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చి.. కొంత నిరాశ పరిచాడు. కాగా.. మంగళవారం ఇదే గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.