వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్‌ను సాధిస్తూ.. భారత క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. మనదేశంలో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్ 2022ను టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో.. వరుసగా మూడు వరల్డ్ కప్‌లు నెగ్గిన జట్టుగా ప్రపంచ రికార్డును సృష్టించింది భారత్. డెహ్రాడూన్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏకంగా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు బాదారు.
ఓపెనర్ వీ రావు (10), వన్ డౌన్‌లో వచ్చిన ఎల్ మీన(0) త్వరగానే అవుటైనా.. మరో ఓపెనర్ సునీల్ రమేష్ 63 బంతుల్లో 136, కెప్టెన్ ఏకే రెడ్డి 50 బంతుల్లో 100 పరుగులతో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి దూకుడికి.. టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దీంతో బంగ్లా ఎదుట 278 పరుగుల టార్గెట్ సెట్ అయింది. బదులుగా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి 120 పరుగుల తేడాతో ఓడింది. భారత బౌలర్లలో మీన, కెప్టెన్ ఏకే రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను, సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా ఫైనల్ చేరింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.
అయితే.. బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే, అందరు ఎక్కువ అభిమానించే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా మాత్రం ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో విఫలమైన విషయం తెలిసిందే. సూపర్ 12 స్టేజ్‌లో సౌతాఫ్రికాతో ఓడి.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ చేరిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను 1-2తో ఓడింది. ప్రస్తుతం తొలి టెస్టు ఆడుతుంది. ఇలా అందరూ అభిమానించే జట్టు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తున్నా.. పెద్దగా ఆదరణ లేని అంధుల క్రికెట్ టీమ్ మాత్రం వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించి.. మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిందంటూ.. నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి భారత్ వరుసగా మూడో సారి టీ20 ఛాంపియన్‌గా నిలువడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Historic moment in Indian cricket history – winning 3rd T20 World Cup for blind. pic.twitter.com/RRGsJlDCSc
— Johns. (@CricCrazyJohns) December 17, 2022