లార్డ్స్ స్టేడియం వేదికగా శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఇక చివరి వన్డే ఆడిన స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామికి ఈ విజయాన్ని కానుకగా అందించింది టీమిండియా. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. 3-0 తేడాతో ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టి కరిపించింది. అయితే మూడో మ్యాచ్ ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా నెలకొంది. ఇండియా బౌలర్ చేసిన పనికి.. ఇంగ్లాండ్ బ్యాటర్ పిచ్ మీదే కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాక ఈ చివరి ఇన్నింగ్స్ వివాదాస్పదంగా కూడా మారింది.
ఇంగ్లాండ్ జట్టు.. చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ అనూహ్యంగా ఔట్ అయింది. మన్కడింగ్ ద్వారా చార్లీ డీన్ ఔట్ అయింది. 44వ ఓవర్‌లో శర్మ బౌలింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఓవర్‌లో మూడో బంతిని వేయడానికి దీప్తి శర్మ రెడీ అవుతుండగా.. అనుకోకుండా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది. దాంతో దీప్తి శర్మ బాల్ వేయకుండానే.. వెంటనే వికెట్లను గిరాటేసింది. ఈ క్రమంలో అంపైర్ చార్లీ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో ఇండియా విజయం ఖరారయ్యింది. ఇక దీప్తి చేసిన పనికి.. చార్లీ డీన్.. పిచ్ మీదనే కన్నీళ్లు పెట్టుకుంది. ఏం జరిగిందో అర్థం కావడానికి ఇంగ్లాండ్ టీమ్‌కు కాస్త సమయం పట్టింది.
ఇక క్రికెట్‌లో ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారనే సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ వర్గాల్లో ఎప్పటి నుంచో పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. అయితే క్రికెట్‌కు సంబంధించి చట్టాలు చేసే మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొన్నిరోజుల క్రితం మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఫలితంగా ప్రసుత్తం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఐసీసీ కూడా దీనికి అంగీకారం తెలిపింది. ఇక అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
ఇక గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో తాజాగా ఇంగ్లాండ్ బ్యాటర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా.. అశ్విన్ తర్వాత మన్కడింగ్ చేసిన రెండో టీమిండియా బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇక క్రికెట్ అభిమానులైతే.. మరో అశ్విన్‌లా మారిన దీప్తి శర్మ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీప్తి శర్మ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.