టీ20 ప్రపంచకప్ సన్నాహకాలను భారత్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో 13 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 145 పరుగులకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా సారధి రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. వామప్ మ్యాచ్ అని తేలిగ్గా తీసుకోకుండా.. రోహిత్ అగ్రెసివ్ కెప్టెన్సీ చూపించడమే అందుకు కారణం.
సాధారణంగా వామప్ మ్యాచులను ఏ జట్లు సీరియస్ గా తీసుకోవు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ కోసం కనుక విజయం గురుంచి ఆలోచించకుండా బ్యాటర్లు ఎక్కువ సేపు ఆడటానికి చూస్తే, బౌలర్లు రోజువారీ బాల్స్ కాకుండా స్వింగ్ కోసమో, స్లో బాల్స్ కోసమో.. ఇలా వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. కాకుంటే.. ఇక్కడ అగ్రశ్రేణి జట్టైన భారత్.. లోకల్ టీంలో చేతిలో ఓడిపోతే అభిమానులు తీసుకోలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రోహిత్ తక్కువ పరుగులే చేసినప్పటికీ.. బౌలర్లకు ఎప్పటికప్పుడు సలహాలిస్తూ వారిచే మంచి ఫలితాలు రాబట్టిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో చేతులెత్తేస్తున్న భువనేశ్వర్‌కు ఎక్కువ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ కనిపించాడు.. రోహిత్. అంతేకాకుండా.. ఫీల్డ్ సెట్ లో కూడా పలు మార్పులు చేస్తూ కనిపించాడు.
కాగా, ఈ మ్యాచులో సూర్య మినహా భారత బ్యాటర్లకు అనుకున్నంత ప్రాక్టీస్ లభించలేదు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ (3), రిషభ్ పంత్ (9) వెంటవెంటనే ఔటవ్వగా, వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా (22) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన సూర్య (35 బంతుల్లో 52) ఎప్పటిలానే తనదైన మెరుపులతో మెరిపించగా, చివర్లో హార్ధిక్ పాండ్యా (22), దినేశ్ కార్తీక్ (19) ధాటిగా ఆడారు. మొత్తానికి భారత జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు.. 145 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, చాహల్ రెండేసి వికెట్లతో రాణించారు.