క్రికెట్ దిగ్గజాలంటే బ్యాటర్లు మాత్రమే అనుకుంటున్న రోజులివి. మీకు తెలిసిన నలుగురు గొప్ప క్రికెటర్లు ఎవరు అని అడిగితే.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ఇలా బ్యాటర్లు పేర్లే చెప్తారు తప్ప.. బౌలర్ల కష్టాన్ని గుర్తించే వారు చాలా తక్కువ. జట్టు తరుపున బరిలోకి దిగే 11 మంది ఆటగాళ్లలో మొదటి వరుసలో ఐదుగురు బ్యాటర్లు ఎలాగో.. చివరి వరుసలో ఉండే ఐదుగురు బౌలర్లు అలాగే. అలా గుర్తిచలేకపోవడం వల్ల ఒక గొప్ప క్రికెటర్ కష్టం కనుమరుగైపోయింది. అతడెవరో కాదు.. భారత మణికట్టు స్పిన్నర్.. ‘అనిల్ కుంబ్లే‘.
ఇతని పేరు చెప్పగానే పాకిస్తాన్ పై తీసిన 10 వికెట్లు సందర్భమే అందరకీ గుర్తొస్తుంది. కానీ, అంతకు మించిన సంఘటన ఒకటుంది. విరిగిన దవడతో మాట్లాడానికే ఇబ్బంది పడ్డ కుంబ్లే.. తల మొత్తం కట్టు కట్టుకొని వచ్చి మరీ కుంబ్లే బౌలింగ్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎలా జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.. 2002, ఐదు టెస్టుల సిరీస్ కోసం సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటించింది. తొలి మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా) వేదికగా నాలుగో టెస్టు.
తొలి రోజు భారత్ 226/3తో పటిష్ట స్థితిలో నిలవగా, రెండో రోజు ఆటలో వికెట్ కీపర్ అజయ్ రాత్రా కంటే ముందే అనిల్ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. అప్పటికే.. విండీస్ పేసర్ మెర్విన్ డిల్లాన్ రాకాసి బౌన్సర్లతో మంచి జోరు మీదున్నాడు. అంతే.. కుంబ్లే వచ్చీ రాగానే బౌన్సర్లతో భయపెట్టడం మొదలుపెట్టాడు. అలా దూసుకొచ్చిన ఒక షార్ట్ పిచ్ బంతి కుంబ్లే దవడను బలంగా తాకింది. ఆ పేస్ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా అదిరిపోయింది. రక్తం కారుతోంది. గ్రౌండ్ లోకి వచ్చిన ఫిజియో అతడిని పరిశీలించి మైదానం వీడాలని కోరినా కుంబ్లే అందుకు ఒప్పుకోలేదు. అలానే బ్యాటింగ్ కొనసాగించాడు. అయినప్పటికీ డిల్లాన్ కనికరం చూపలేదు. మళ్లీ అలాగే బౌన్సర్లతో భయపెట్టాడు. చివరకు అతని బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు కుంబ్లే.
This test is also famous for Anil Kumble bowling with a broken jaw after being hit by Merv Dillon
“”I didn’t want to sit around” @anilkumble1074 #CricketTwitter pic.twitter.com/YX4FXA8FBN— Pushkar Pushp (@ppushp7) May 13, 2022
పెవిలియన్ చేరాక ఎక్స్‌రే చేస్తే దవడలో పగులు వచ్చినట్లు కనిపించింది. గాయంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు పెద్ద బ్యాండేజీని తలకు- దవడకు కట్టుగా కట్టారు. సర్జరీ చేస్తే మంచిదన్నట్లుగా టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. నిజానికి ఈ స్థితిలో ఎలాంటి ఆటగాడు ఉన్నా.. ఆ మ్యాచ్ లో అతని పోరాటం ముగిసినట్టే. కానీ.., అక్కడ ఉంది అనిల్ కుంబ్లే. దేశం తరుపున క్రికెట్ ఆడటాన్ని డబ్బులుతో కాకుండా, గర్వంతో కొలిచే ఓ జెంటిల్మెన్. 513 పరుగుల భారీ స్కోరు వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ లో పైచేయి సాధించాలంటే.. చకచకా వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టాలి. పిచ్ స్పిన్ కు అనుకులిస్తోంది. కానీ, కుంబ్లే లేడు.
క్రిస్ గేల్, బ్రియాన్ లారా, రామ్ నరేష్ శర్వాన్, కార్ల్ హూపర్, శివనారాయణ్ చందరపాల్.. ఇంతటి దుర్భేధ్యమైన విండీస్ బ్యాటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో గంగూలీకి అర్థమవ్వడం లేదు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, వసీం జాఫర్ ల చేత కూడా బౌలింగ్ చేయిస్తున్నాడు. ఇదంతా చూడలేకపోయిన కుంబ్లే.. అనూహ్యంగా కట్టుతోనే క్రీజ్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు, విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినలేదు. బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. స్లో రనప్ తో బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. అతడు కట్టుతో ఉన్న తీరు.. అతడు బౌలింగ్ చేస్తున్న విధానం చూసి భారత ఆటగాళ్లు చలించిపోయారు.
Remember this match?? When Anil Kumble got Brian Lara’s wicket while bowling with a bandaged broken jaw pic.twitter.com/wbxXSV8wFQ
— Doordarshan Sports (@ddsportschannel) July 3, 2015
అతను నొప్పితో అల్లాడుతుండటం చూసిన అంపైర్ సైతం.. బౌలింగ్ చేయగలవా అంటూ మళ్లీ మళ్లీ అడిగాడు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన కుంబ్లే బౌలింగ్ చేసి అత్యంత కీలకమైన బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. ఆ సమయంలో కుంబ్లేలో కనిపించిన భావోద్వేగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. అయితే మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో.. వెస్టిండీస్ బ్యాటర్స్ క్రీజ్ లో పాతుకుపోయారు. కార్ల్ హూపర్(136), శివనారాయణ్ చందరపాల్(136), రిడ్లీ జాకబ్స్(118) పరుగుల వరద పారించారు. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయినప్పటికీ.. ఈ మ్యాచులో అనిల్ కుంబ్లే చూపిన తెగువ, పోరాటం మరవలేనిది. చిన్న గాయం తగిలితేనే మైదానం వీడుతున్న ఈ రోజుల్లో.. కుంబ్లే పోరాటం అసమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Anil Kumble with broken jaw… What a dedication for game when indian team was in much need of his bowling. pic.twitter.com/eBMlzNr6t7
— Nandram Kashyap (@NandramKashyap) January 22, 2020