క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ ఇరు జట్లు తలపడితే ఉండే హైటెన్షన్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
క్రికెట్లో కొన్ని సమరాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ మ్యాచుల కోసం పోటీపడుతున్న జట్ల అభిమానులతో పాటు మొత్తం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నప్పుడు చూడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటారు. కానీ దీని కంటే అతి పెద్ద సమరం అంటే భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లనే చెప్పాలి. ఈ దాయాది దేశాలు బరిలోకి దిగి కొదమసింహాల్లా తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. క్రికెట్ హిస్టరీలో బెస్ట్ మ్యాచ్‌లు అనదగ్గవి ఈ ఇరు జట్ల మధ్య జరిగినవి ఎక్కువగా ఉన్నాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లు థ్రిల్లర్ సినిమాలను తలదన్నేలా ఉంటాయి. ఎవరు గెలుస్తారో ఆఖరి వరకు చెప్పలేని పరిస్థితి. ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే చాలు.. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ డుమ్మాలు కొట్టి మరీ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడి చాలా ఏళ్లయింది. సరిహద్దుల్లో ఘర్ణణలు, భారత్‌పై కవ్వింపు చర్యల నేపథ్యంలో పాక్‌తో ఆడేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. దీంతో కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇరు టీమ్స్ తలపడుతున్నాయి. త్వరలో జరిగే ఆసియా కప్‌లో ఇండియా-పాక్ మధ్య పోరును చూడొచ్చు. అలాగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లోనూ ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈసారి ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌కు భారత దేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ క్రికెట్ వర్గాల్లో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది.
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే లక్ష సీట్ల కెపాసిటీ ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్తో బీసీసీఐ చర్చించనుందట. అయితే భద్రతా కారణాల దృష్ట్యా చెన్నై లేదా బెంగళూరులో తమ మ్యాచ్‌లు ఆడాలని పాకిస్థాన్ జట్టు భావిస్తోందట. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా తమకు ఓకే అని ఆ టీమ్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ రానుంది. దీంతో ఇండియా-పాక్ ఎక్కడ, ఎప్పుడు తలపడతాయో స్పష్టంగా తెలిసిపోతుంది.
Narendra Modi Stadium likely to host the India Vs Pakistan match in the 2023 World Cup. (Reported by Indian Express). pic.twitter.com/RYrY97nO6E
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2023