టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత.. కంటితుడుపు చర్యగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 1-0తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా కేన్ సేనతో వన్డే సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో భారత్ ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇక బుధవారం జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుతు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొంతకాలంగా టీమిండియా వన్డేల్లో శుభారంభాలు అందిస్తున్న ధావన్-శుబ్‌మన్ గిల్ జోడీ ఈ మ్యాచ్‌లో మాత్రం విఫలం అయ్యింది. మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. కేవలం 13 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కొద్ది సేపటికే 28 పరుగులు చేసి ధావన్ కూడా మిల్నే బౌలింగ్ అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్.. 49 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. అతనికి మరో బ్యాటర్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో టీమిండియా పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రిషభ్ పంత్(10) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ సైతం 6 పరుగులు చేసి అవుట్ అయి నిరాశపరిచాడు. దీపక్ హుడా సైతం 12 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే టెయిలెండర్లతో కలిసి ఒంటరి పోరాటం చేశాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి రాణించడంతో.. టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులు చేయగలిగింది.
ఈ నామమాత్రపు స్కోర్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టీమిండియా యువ సంచలనం, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు. న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ 100 పరుగుల పార్ట్నర్‌షిప్ మార్క్ దాటకుండా.. 97 పరుగుల వద్ద తొలి వికెట్ అందించాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసిన ఫిన్ అలెన్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కాన్వె 38 పరుగులతో పాట అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన కేన్ విలియమ్సన్ మూడు బంతులాడి ఇంకా పరుగులేమి చేయకుండా ఉన్న సమయంలో వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత ఎంత సేపటికీ వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఆట ఆగే సమయానికి న్యూజిలాండ్ పటిష్టస్థితిలో నిలిచింది. 32 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే కివీస్‌కు అవసరం. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. కానీ.. వర్షం న్యూజిలాండ్‌కు విజయాన్ని దూరం చేసింది. టీమిండియాను ఓటమి నుంచి రక్షించింది. దీంతో 1-0తో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
IND vs NZ: Third ODI match called off due to rain; New Zealand win series 1-0 against India
Read @ANI Story | https://t.co/itjhvbUxZJ#IndVsNZ #NZvsIND #ODI pic.twitter.com/wf8CTrD0Ka
— ANI Digital (@ani_digital) November 30, 2022