టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన తాజాగా గురువారం శ్రీలంకతో జరగిన తొలి టీ20లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ వరుసగా 10 టీ20ల్లో అపజయం ఎరుగని జట్టుగా నిలిచింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసేందుకు నిర్ణయించింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. సెంచరీ వైపు దూసుకెళ్తూ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలు స్వీకరించాడు.
విరాట్ కోహ్లి గైర్హాజరీలో మూడో స్థానంలో నిలిచిన అయ్యర్, ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత తన దాడిని మరింత పెంచాడు. కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అయ్యర్ చివరి 3 ఓవర్లలో 14 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును 199 పరుగుల పటిష్ట స్కోరుకు చేర్చాడు. 200 భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి బంతికే శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసంక వికెట్ తీశాడు. ఇక అక్కడి నుంచి శ్రీలంక ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. చరిత్ అసలంక మాత్రమే జట్టు తరఫున ధీటుగా బ్యాటింగ్ చేయగలిగాడు. 47 బంతుల్లో 53 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లలో చమిక కరుణరత్నే (21 పరుగులు, 14 బంతుల్లో), దుష్మంత చమీర (24 నాటౌట్, 14 బంతుల్లో) వేగంగా పరుగులు చేసినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 20 ఓవర్లలో శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున భువనేశ్వర్, వెంకటేష్ అయ్యర్ తలో 2 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
టీ20 టాప్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కునెట్టి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ ప్రస్తుతం 123 మ్యాచ్‌లలో 115 ఇన్నింగ్స్‌లలో 33 సగటు, 140 స్ట్రైక్ రేట్‌తో 3307 పరుగులు చేశాడు. 108 ఇన్నింగ్స్‌లలో 3299 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆటగాడు గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, చాలా కాలం పాటు ఈ రికార్డును కలిగి ఉన్న కోహ్లి 89 ఇన్నింగ్స్‌లలో 3296 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ 37 పరుగుల వద్ద ఈ రికార్డు సాధించాడు.
అదరగొట్టిన ఐపీఎల్ కోటీశ్వరులు..
A cracking half-century for @ShreyasIyer15 👏👏.
His 4th in T20Is.
Live – https://t.co/2bnp2QpJp5 #INDvSL @Paytm pic.twitter.com/udcM4uuaAY
— BCCI (@BCCI) February 24, 2022
ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అదరగొట్టారు. ఇషాన్ 89 పరుగుల చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. చూడచక్కటి షాట్లతో అలరించాడు. ఇక మరో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో ఫిఫ్టీ కొట్టేశాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లసాయంతో 57 పరుగుల చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇటివల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. ఫ్రాంచైజ్‌లు ఈ ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి.
చివరకు ఇషాన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ సొంత చేసుకున్నాయి. కాగా ఐపీఎల్ వేలం 2022లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ నిలిస్తే.. కేకేఆర్ అత్యధిక ధర పెట్టి కొన్న ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. ఇలా తమపై భారీ ధర పెట్టడం ఏ మాత్రం తప్పు కాదన్నంటూ ఇద్దరు ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం, రోహిత్ శర్మ రికార్డు, ఇషాన్, శ్రేయస్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.