భారత్-సౌతాఫ్రికా మధ్య గౌహతీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలను మిగిల్చింది. ఫోర్లు, సిక్సుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పవర్‌తో భారీ స్కోర్ చేసి స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. టీమిండియా టాపార్డర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రోటీస్ బౌలర్లు బలైపోయారు. చివర్లో ది ఫినిషర్ దినేష్ కార్తీక్ సైతం 7 బంతుల్లో 17 పరుగులతో రెచ్చిపోవడంతో టీమిండియా.. సౌతాఫ్రికా ఎదుట 237 పరుగుల భారీ స్కోర్‌ను ఉంచింది. సౌతాఫ్రికా కూడా భారత బౌలర్లను ఊతికి ఆరేసింది. కానీ.. భారీ లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వేగంగా ఆడుతూ.. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాడు. ఇక రోహిత్ తన బుక్‌లో లేని కొత్త రకం షాట్లు ప్రయత్నిస్తూ ఇబ్బంది పడినా.. తర్వాత కుదురుకుని అద్భుతంగా ఆడాడు. భారీ భాగస్వామ్యం దిశగా దూసుకుపోతున్న ఈ జోడీని 10వ ఓవర్‌లో కేశవ్ మహరాజ్ విడదీశాడు. కేశవ్ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 43 పరుగులు చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ చేసి మంచి జోరుమీదున్న రాహుల్ కూడా 12వ ఓవర్‌లో మహరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
సూర్య విధ్వంసం..
ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో జత కలిసి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తమ సహజశైలిలోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రేక్షకులను ఫోర్లు, సిక్సుల వర్షంలో తడిపి ముద్దచేశాడు. సూర్య చెలరేగుతుంటే.. సీనియర్ ప్రో కింగ్ కోహ్లీ అతనికే ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ.. తెలివిగా వ్యవహరించాడు. సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాకా.. కోహ్లీ కూడా దంచడం మొదలుపెట్టాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులతో విధ్వంసం సృష్టించిన సూర్య.. లేని పరుగు కోసం ప్రయత్నించి.. 19వ ఓవర్ తొలి బంతికి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం ఉన్నా.. దినేష్ కార్తీక్‌కు పూర్తి స్ట్రైక్ తీసుకోమని తన నిస్వార్థ క్రికెట్‌ను చూపించాడు. కోహ్లీ త్యాగాన్ని వృథా చేయకుండా.. డీకే కూడా 7 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 17 పరుగులు చేసి కావాల్సిన ముగింపు అందించాడు. డీకే కొట్టిన ఆ పరుగులే టీమిండియాను రక్షించాయని అనుకోవచ్చు.
ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆరంభంలోనే ఇబ్బంది పెట్టారు. పిచ్ నుంచి స్వింగ్ లభించడంతో దీపక్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో ఒత్తిడిలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్లను రెండో ఓవర్‌లో అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన ప్రొటీస్ కెప్టెన్ బావుమా మరోసారి డకౌట్‌గానే వెనుదిరిగాడు. వన్ డౌన్‌లో వచ్చిన రోలీ రోసోవ్‌ను కూడా అర్షదీప్ డకౌట్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓపెనర్ క్వింటన్ డికాక్, మార్కరమ్ తమ అనుభవాన్ని ఉపయోగించి మరో వికెట్ పడకుండా కొద్ది సేపు నిదానంగా ఆడారు. 7వ ఓవర్‌లో 33 పరుగులు చేసిన మార్కరమ్ అవుట్ అయిన తర్వాత అసలు కథ మొదలైంది.
భయపెట్టిన మిల్లర్..
డికాక్‌తో కలిసిన డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 106 పరుగులు చేసి టీమిండియ బౌలర్లను ఊచకోత కోశాడు. కానీ.. అప్పటికే ఛేదించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో విజయానికి 16 పరుగుల దూరంలోనే నిలిచిపోయాడు. డికాక్ కూడా 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి రాణించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకుని దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా.. బౌలింగ్ మాత్రం చెత్తగా ఉందనే చెప్పాలి.
How can @surya_14kumar‘s dazzling form be retained? 🤔
🗣️ 🗣️ Here’s what #TeamIndia captain @ImRo45 said. #INDvSA pic.twitter.com/Gkbaej2dHc
— BCCI (@BCCI) October 2, 2022
.@klrahul bags the Player of the Match award as #TeamIndia seal a win in the second #INDvSA T20I. 👍 👍
Scorecard 👉 https://t.co/58z7VHliro pic.twitter.com/HM9gTI7tzo
— BCCI (@BCCI) October 2, 2022
A stunning batting display from Team India in the second T20I vs South Africa 🔥👏#SuryakumarYadav #ViratKohli #DineshKarthik #INDVsSA #Cricket pic.twitter.com/GnBnhQuDSN
— Wisden India (@WisdenIndia) October 2, 2022
ఇది కూడా చదవండి: టీమిండియాపై షేన్ వాట్సన్ కామెంట్స్.. టీ20 ప్రపంచ కప్ గెలవదు అంటూ..