మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. తొలి టీ20 వర్షార్పాణం కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అంతుపట్టని షాట్లతో కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. అదరహో అనిపించాడు. ఇక బౌలింగ్‌లోనూ టీమిండియా చెలరేగిపోయింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను 126 పరుగులకే ఆలౌట్ చేసి 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్య మెరవగా.. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ దీపక్ హుడా 4 వికెట్లతో రాణించాడు. ఇది కదా టీమిండియా సత్తా అని కొంతమంది అనుకొని ఉండవచ్చు. కానీ.. వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా సాధించిన ఈ గెలుపు ఓ గెలుపేనా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది.
సూర్య కొత్తగా ఏం చేశాడు..?
మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సామర్థ్యంపైన ఎవరీ ఎలాంటి అనుమానాలు లేవు. విరాట్ కోహ్లీ లాంటి నేటి తరం గొప్ప ఆటగాడే సూర్య ఆటకు ఫిదా అయిపోయాడు. అలాంటి ప్లేయర్ సెంచరీ చేయడం పెద్ద విశేషం కాదు. సూర్యలో ఆ సత్తా ఉందని అందరికీ తెలుసు. పిచ్‌తో, బౌలర్‌తో, పరిస్థితులతో సంబంధంలేకుండా.. అద్భుతమైన షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడని గతంలో చూశాం. భవిష్యత్తులోనూ చేస్తాడనే నమ్మకం అందరిలో వందకు వందశాతం ఉంది. సూర్య రాకతో టీమిండియాలో నాలుగో స్థానం పటిష్టంగా మారింది. కానీ.. మిగతా స్థానాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022లో చెప్పుకుంటూ పోతే.. చారెడు తప్పిదాలు టీమిండియాలో బయటపడ్డాయి. కనీసం వరల్డ్ కప్ తర్వాత అయినా వాటిపై ఫోకస్ పెట్టకుండా.. మళ్లీ చేసిన తప్పులే చేస్తూ.. ఒక్క ఆటగాడు అందించే విజయంతో సంతోష పడాలా? ప్రతిసారీ సూర్య లేదా కోహ్లీ? వీళ్లిద్దరూ విఫలమైతే చేతులెత్తేయడమేనా?
ఓపెనింగ్ జోడీ బలహీనంగా ఉంది.. మిడిల్డార్, లోయర్డార్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. వరల్డ్ కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా సెమీస్‌తో సరిపెట్టుకుంది. ఇలాంటి లోపాలపై దృష్టిపెట్టకుండా.. టీమిండియా సాధించిన విజయం ఎవరికి ఉపయోగం. ఆడేవాడు ఎలాగో బాగానే ఆడతాడు. అది సూర్య నిరూపించాడు. అందుకే అతని సెంచరీపై కూడా అభిమానులు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే సూర్య నుంచి అలాంటి స్కోర్ వస్తుందని వారికి తెలుసు. కానీ.. టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత.. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు జరగటం లేదనే విషయమే ఇప్పుడు అభిమానుల్లో అసంతృప్తికి కారణంగా నిలుస్తోంది.
సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ..?
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ వరకు చేరిందంటే.. అది విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వల్లే. అది ఎవరూ కాదనలేని సత్యం. మరి మిగతా వాళ్లు ఏం చేశారో అందరూ చేశారు. ఇలా ఒకరిద్దరిపై ఆధారపడితే టీమిండియాకు వరల్డ్ కప్స్ రావు. కనీసం వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత అయినా ఈ విషయాన్ని గుర్తించి.. వాటి గురించి తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియా ఫోకస్ చేయడం లేదు. ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్ పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ లాంటి 156 వేగంతో బౌలింగ్ వేసే బౌలర్‌ను పక్కనపెట్టారు. కనీసం వరల్డ్ కప్ తర్వాత అయినా.. అతన్ని ఆడించి మరింత ట్రైన్ చేసుకోకుండా.. భువనేశ్వర్ కుమార్ లాంటి రేపో మాపో రిటైర్ అయ్యే ప్లేయర్‌కే అవకాశం ఇస్తున్నారు. అతన్ని ఎలాగో వరల్డ్ కప్ ఆడించారు కదా? కనీసం వచ్చే వరల్డ్ కప్స్ కోసమైనా ఉమ్రాన్ లాంటి యంగ్ లాలెంట్‌ను పదునుపట్టరా?
ఇక మరో బిగ్ మిస్టేక్.. సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం. ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో పరుగుల వరద పారించగల ఈ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వడమే నేరం అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పటికే వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాప్ అయినా పంత్‌కు మాత్రం ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ.. ఓపెనర్‌గా అద్భుతంగా ఆడే సంజూ శాంసన్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ చేసిన ప్రయోగాలు చాలవన్నట్లు.. ఈ తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే ఏకంగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లతో ఓపెనింగ్ చేయించి బొక్కబోర్లా పడ్డాడు. ఇక బ్యాటింగ్‌లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న దీపక్ హుడాను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో ఈ ఒక్క క్రికెట్ అభిమానికి కూడా అంతుచిక్కని ప్రశ్న. వరల్డ్ కప్ నెగ్గలేక చతికిల పడినా.. వచ్చే వరల్డ్ కప్స్ కోసం ఆలోచించకుండా.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుండా.. ఆడించిన వారినే ఆడిస్తూ.. పోతే టీమిండియా మరో వెస్టిండీస్ కావడం ఖాయమని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Congratulations to Team India on a phenomenal victory, and a huge round of applause to @surya_14kumar on his firework century. Go #TeamIndia 🇮🇳#INDvNZ pic.twitter.com/oUGsGMDy3U
— Jay Shah (@JayShah) November 20, 2022