పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో విఫలమైనా భారత బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ కు.. ఓపెనర్ షై హోప్ (115) సూపర్ సెంచరీ, నికోలస్ పూరన్ (74; ఒక ఫోర్, 6 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించడంతో.. 311 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. 31 బంతుల్లో 13 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి వికెట్‌గా వెనుతిరిగాడు. కాసేపటికే శుభ్‌మన్ గిల్ (43), సూర్యకుమార్ (9) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. దీంతో 79 రన్స్‌కు 3 కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయాస్ అయ్యర్ 63), సంజూ శాంసన్ (54) ఆదుకున్నారు.
ఆఖరి 10 ఓర్లలో విజయానికి 100 రన్స్ అవసరమైన దశలో దీపక్ హుడాతో కలిసి అక్షర్ పటేల్ రెచ్చిపోయాడు. ధాటిగా ఆడుతూ వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. హుడా ఔటైనప్పటికీ టెయిలెండర్లతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వికెట్ తీయడంతో పాటు 64 రన్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్‌కు ,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అవార్డు దక్కింది.