బంగ్లా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన భారత్, టెస్ట్ సిరీస్ నెగ్గి పరువు దక్కించుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుస వికెట్లు కోల్పోతూ.. పీకల మీదకు తెచ్చుకుంది. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ పంత్(9) వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాట్లు ఎత్తేసిన వేళ అశ్విన్, అయ్యర్ అసమాన పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచులో బంగ్లా బౌలర్ల పోరాటాన్ని మెచ్చుకోవాల్సిందే.
45/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్.. వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 56 పరుగుల వద్ద ఉనద్కత్ (13), 71 పరుగుల వద్ద రిషభ్ పంత్ (9), 74 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (34) పెవిలియన్ చేరడంతో.. ఇక ఓటమి తప్పదనుకున్నారు. అయితే, క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(29), రవిచంద్రన్ అశ్విన్(42) తొలుత నెమ్మదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత సింగిల్స్ తీస్తూ, సంయమనంతో ఆడుతూ జట్టును విజయ తీరాలవైపు నడిపించారు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ 5 వికెట్లు తీయగా.. షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా, అంతకుముందు 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన పూజారా, ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ.. వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(34) పర్వాలేదనిపించాడు. కాగా, అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
Ravichandran Ashwin and Shreyas Iyer’s unbeaten 71-run stand take India over the line ✌️#WTC23 | #BANvIND | 📝 https://t.co/ZTCALEDTqb pic.twitter.com/aSdztm13zO
— ICC (@ICC) December 25, 2022