ప్రస్తుతం టీమిండియా ఏకైక లక్ష్యం ఈ ఏడాది అక్టోబర్‌లో మనదేశంలోనే జరగనున్న ‘వన్డే వరల్డ్ కప్ 2023’ను గెలవడం. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత్ మళ్లీ 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. ఆ తర్వాత రెండు సార్లు(2015, 2019) వన్డే ప్రపంచ కప్పులు జరిగినా.. భారత్ విజేతగా నిలవలేకపోయింది. అయితే.. టీమిండియా రెండో సారి గెలిచిన 2011 వన్డే వరల్డ్ కప్ మన దేశంలోనే జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది వరల్డ్ కప్ సైతం మన దేశంలోనే జరగనుంది. దీంతో.. 2011 సీన్‌ను మళ్లీ రిపీట్ చేసి.. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని టీమిండియాతో పాటు బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది.
అయితే.. ఈ వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఒక పెద్ద తప్పు చేస్తోందని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు భారీగా ప్రయోగాలు చేసిన టీమిండియా, తీరా వరల్డ్ కప్ ముందు అన్ని ప్రయోగాలు బెడిసి కొట్టి బొక్కబోర్లా పడింది. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా కొంతమంది ఆటగాళ్లకు భారీగా అవకాశాలు ఇచ్చి, కొంతమంది ఆటగాళ్లను వన్డేలు, టెస్టులకు పరిమితం చేశారు. అలా అవకాశాలు దక్కించుకున్న వారిలో బుమ్రా, జడేజా, చాహల్ వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. బుమ్రా, జడేజా గాయాలతో వరల్డ్ కప్‌కు దూరం కాగా.. యుజ్వేంద్ర చాహల్ టీమ్‌లో ఉన్నా.. అతని స్థానంలో అశ్విన్‌ను ఆడించారు. వరల్డ్ కప్ ముందు వరకు ప్రణాళికల్లో లేడని అశ్విన్‌ను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ తీరా వరల్డ్ కప్‌లో అతన్నే ఆడించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో వీక్ బౌలింగ్ ఎటాక్ మన విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిందో అందరికి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోని టీమిండియా.. మళ్లీ అదే తప్పును రిపీట్ చేసేలా కనిపిస్తోంది. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు జట్టులో సుస్థిర స్థానం కల్పించకుండా.. స్పిన్నర్లతో ఆడలాడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 మనదేశంలోనే జరగనుంది. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. పైగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టైటిల్ ఫేవరేట్ జట్లు మన దేశంలో స్పిన్‌ను ఆడేందుకు ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కచ్చితంగా ఒక మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్‌ను జట్టులో ఉంచుకోవాలి. కొన్ని సార్లు ఇద్దరు స్పిన్నర్లతో సైతం బరిలోకి దిగాల్సివస్తుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఒక పక్కా ప్రణాళికతో ఒక స్పిన్నర్‌ను రెడీ చేసుకోవాలి.
కానీ.. టీమిండియా ఆ పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వీరిలో ఎవరు ఎప్పుడు ఆడుతారో? ఆడరో? ఎవరికీ క్లారికటీ లేదు. దొరికిన అవకాశాల్లో ఒకటి రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తున్న ఈ స్పిన్నర్లు.. జట్టులో సుస్థిర స్థానం విషయంలో మాత్రం అభద్రతా భావంతోనే ఉన్నారు. పైగా తాత్కాలిక కెప్టెన్ల అత్యుత్సాహం సైతం ఈ స్పిన్నర్లకు శాపంగా మారింది. టీమ్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్న యుజ్వేంద్ర చాహల్‌కు.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో.. పూర్తిగా స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. కానీ.. తాను మాత్రం 4 ఓవర్లు వేసి, పార్ట్‌టైమ్ బౌలర్ దీపక్ హుడాకు 4 ఓవర్లు ఇచ్చాడు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్న చాహల్‌కేమో రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు.
పోనీ చాహల్ ఏమైనా ఎక్కువ రన్స్ ఇచ్చాడా అంటే అదీ లేదు. 2 ఓవర్లలో 4 రన్స్ ఇచ్చిన ఒక వికెట్ తీశాడు. అందులో తొలి ఓవర్ మెయిడెన్‌గా వేశాడు. మరో రెండు ఓవర్లు వేస్తే.. ఇంకో రెండు మూడు వికెట్లు తీసుకుంటే.. జట్టులో ఒక స్పెషలిస్ట్ బౌలర్‌గా ఉన్న చాహల్ కాన్ఫిడెన్స్ ఎంతో పెరిగి ఉండేది. అది ఆలోచించకుండా పాండ్యా.. చెత్త కెప్టెన్సీ చేశాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్‌ను రెండో టెస్టులో పక్కన పెట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. జట్టులో ప్లేస్ ఉంటుందో లేదో తెలియకపోతే.. ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంది. వరల్డ్ కప్‌కు ఇంకో ఆరేడు నెలల సమయం మాత్రమే ఉంది. మరి వరల్డ్ కప్‌లో ఆడే స్పిన్నర్ ఎవరు? అంటే మాత్రం సమాధానం లేదు. పరిస్థితి అలా ఉంది.
2011లో హర్భజన్ సింగ్ లాంటి మేటి స్పిన్నర్ ఉండటం జట్టుకు ఎంత ప్లస్ అయిందో అప్పుడే మర్చిపోకూడదు. అందుకే.. ప్రస్తుతం టీమిండియాకు ఉన్న అతి తక్కువ ఛాయిస్‌లో ఒకర్ని ఎంపిక చేసుకుని.. వరల్డ్ కప్ వరకు వరుసగా అవకాశాలు ఇస్తూ.. వారిలో నమ్మకం కలిగించి.. వారి కాన్ఫిడెన్స్‌ను పెంచే ప్రయత్నం చేయాలి. మహా అయితే.. టీమిండియాకు చాహల్, కుల్దీప్, అశ్విన్ రూపంలో స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఉన్నా.. వారు ఆల్‌రౌండర్లుగా ఉంటారు తప్ప, స్పెషలిస్ట్ స్పిన్నర్లు కాలేరు. పైగా జడేజా ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. అందుకే.. కుల్దీప్ లేదా చాహల్‌కు లేదా ఇద్దరికి వరుస అవకాశాలు కల్పిస్తూ.. వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ చేయాలి. అప్పుడే.. మరోసారి మన దేశంలో టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఎత్తే అవకాశాలు మెరుగవుతాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
OneCricket picks India’s probable XI for their 2023 ODI World Cup opener🏆
Share your Playing XI 👇#WorldCup2023 #TeamIndia #CricketTwitter pic.twitter.com/dZGsmmvFk0
— OneCricket (@OneCricketApp) January 30, 2023