మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో.. అంత వేగంగా కదులుతాడు. ఇక తన వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ లను లాగేసుకోవడంలో సిద్దహస్తుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోని ఆలోచనలను అందుకోవడం హేమాహేమీల వల్లే కాక తోక ముడిచిన సందర్భాలు కోకొల్లలు. ధోని తొలి నాల్లలో డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి అడుగుపెడుతుంటే.. జూలు విదిల్చిన సింహంలా కనిపించేవాడు. ఇక అతడు వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే ఓ చిరుత పరిగెత్తుతుందా అన్న సందేహం కలగక మానదు. అదీ కాక ధోని వికెట్ల వెనుక ఉంటే బ్యాట్స్ మెన్ క్రిజు నుంచి అడుగు బయటపెట్టడానికే గజగజ వణికిపోతారు. అయితే ధోని రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యిందిగా, ధోని ముచ్చట ఇప్పుడెందుకు వచ్చింది అంటారా? దానికీ ఓ కారణం ఉంది. తాజాగా శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో పంత్ స్థానంలో మిస్టర్ కూల్ ఉంటే మ్యాచ్ కచ్చితంగా భారతే గెలిచేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ను వారు గుర్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ లో టీమిండియాకు ధోని ఆడిన కాలాన్ని స్వర్ణయుగమనే చెప్పాలి. ఎందుకంటే భారత చిరకాల స్వప్నం అయిన ప్రపంచకప్ ను టీమిండియాకు 2011లో అందించాడు. అదీ కాక టీ20 వరల్డ్ కప్ కూడా భారత్ ఖాతాలో జమచేశాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన మీ బలం ఏంటీ ధోనీ భాయ్ అంటే మాత్రం చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. అవును చిరునవ్వే అతడి రహస్యం. మ్యాచ్ లో ఎంత ఒత్తిడి ఉన్నాగానీ ధోని చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అదే అతడి బలం.. జట్టుకు కొండంత బలం. ఇన్ని సంవత్సరాలు మీరు అతడి ఆటను ఆస్వాదించారు కదా! ధోనీని మైదానంలో ఎప్పుడైనా కోపంగా చూశారా? అంటే? మీరు ఆలోచనలో పడటం ఖాయం.. కానీ మీకు అతడి ఆవేశం ఎక్కడా కనిపించదు. ఇక ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లను సైతం తన కనుసైగలతో భారత్ వైపు తిప్పడంలో ధోనినీ మించిన వారు లేరనడంలో అతిశయోక్తి లేదు. అందుకే అతడిని అభిమానులు క్రికెట్ ఐన్ స్టీన్ అని సరదాగా అభివర్ణిస్తూంటారు.
అది 2016 మార్చి 23.. T20 ప్రపంచ కప్ లో భాగంగా చిన్న స్వామి స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత బంగ్లా ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగింది. తడబడుతూనే లక్ష్యం వైపు సాగింది. మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతూ చివరి ఓవర్ దాకా వచ్చింది. ఇక చివరి ఓవర్ వేసే బాధ్యతను యువ ఆల్ రౌండర్ అయిన పాండ్యాకు అప్పగించాడు ధోని. ధోనీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాండ్యా నాలుగు, ఐదు బంతులకు బంగ్లా బ్యాట్స్ మెన్స్ అయిన ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లాను అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే బంగ్లకు చివరి బంతికి 2 పరుగులు అవసరం అయ్యాయి. ఇక స్ట్రైకింగ్ ఎండ్ లో షువగటా హోం ఉన్నాడు. పాండ్యా బాల్ ని ఆఫ్ సైడ్ బౌన్స్ వేశాడు. దాన్ని బంగ్లా బ్యాటర్ టచ్ చేయలేదు.. కానీ అవతలి ఎండ్ లో ఉన్న ముస్తఫిజూర్ రెహ్మాన్ పరుగు కోసం ప్రత్నించి ధోని చేతిలో రన్ అవుట్ అయ్యాడు.
అయితే ధోని చేసిన ఈ రనౌట్ లో వింతేం ఉంది అనుకుంటున్నారా? దాంట్లో వింత లేదు కానీ పదునైన వ్యూహం ఉంది.. అంతు చిక్కని ఆలోచన ఉంది.. వాటితోనే ధోనీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన పరిస్థిలో ఏ బ్యాట్స్ మెన్ అయినా ఒత్తిడి గురికావడం సహజం. దాంతో బంతి తాకక పోయినా పరిగెత్తాలి అని చూస్తాడు. ఇది ముందే ఊహించిన మిస్టర్ కూల్ తన కుడి చేయికి ఉన్న గ్లౌస్ ను తీసేశాడు. ఎందుకంటే త్రో వేయడానికి వీలుగా.. అదీ కాక బంతి బౌలర్ నుంచి జారే సమయంలోనే ముందుకు కదిలి బాల్ ను ముందే అందుకు చిరుత వేగంతో ముందుకు కదిలి బంగ్లా బ్యాటర్ ను అవుట్ చేశాడు. అప్పట్లో ధోని చేసిన ఈ రన్ అవుట్ అతడి ముందు చూపుకు ఓ మచ్చు తునక.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆసియా కప్ లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో కూడ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో టీమిండియాకు 21 పరుగులు అవసరం అయ్యాయి.19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్14 రన్స్ సమర్పించుకున్నాడు. దాంతో చివరి ఓవర్లో లంక విజయానికి 7 పరుగులు అవసరం. చివరి ఓవర్ వేయడానికి అర్షదీప్ సింగ్ వచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సింగ్ మెుదటి నాలుగు బాల్స్ లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి 2 బంతుల్లో 2 రన్స్ కావాలి. ఎంతో ఉత్కంఠ మధ్య 5వ బాల్ ను అర్షదీప్ అద్భుతంగా వేయడంతో లంక బ్యాటర్ శనక బంతిని తాకడంలో విఫలం అయ్యాడు. బాల్ నేరుగా కీపర్ పంత్ చేతిలో పడింది. కానీ పంత్ రెండు అడుగులు మాత్రమే ముందుకు వేసి బాల్ ని వికెట్లకు త్రో విసరగా అది మిస్ అయ్యింది. బంతి అర్షదీప్ కు అందగా అతడు కూడా త్రో చేశాడు కానీ ఈ సారి కూడా బాల్ వికెట్లను తాకకుండా వెళ్లింది. దాంతో మరో రన్ తీసిన లంక బ్యాట్స్ మెన్ ఒక బాల్ మిగిలుండగానే విజయం సాధించారు.
ఈ క్రమంలోనే పంత్ వికెట్ కీపింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ లో జార్ఖండ్ డైనమైట్ ధోనీ లాంటి చిరుత కదలికలు ఏ కోశానా కనిపించలేదు. అదీ కాక అతడు త్రో వేయడంలో విఫలం అయ్యాడు. వాస్తవానికి పంత్ కొద్దిగా బద్దకస్తుడే.. గతంలో కొన్ని సార్లు నిర్లక్ష్యంగా రనౌట్ అయిన సందర్భాలూ లేకపోలేదు. ఈ క్రమంలో అతి కీలకమైన మ్యాచ్ లో పంత్ తన పరిణతిని చూపించాల్సిందిగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధోని తర్వాత అంత వేగంగా వికెట్ల వెనుక కదిలే కీపర్ భారత్ కు లేడనే చెప్పాలి. కొద్దో గొప్పో దినేష్ కార్తీక్ వికెట్ల వెనక చాలా చూరుగ్గా కదులుతాడు అనే పేరుంది. దాంతో ఈ మ్యాచ్ లో గనక మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఉంటే కచ్చితంగా భారత్ గెలిచేదని క్రికెట్ అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ ధోని పంత్ ప్లేస్ లో ఉంటే భారత్ గెలిచేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🤣🤣🤣🤣#SLvIND pic.twitter.com/k5JgRZ1AgC
— Dr Romeo (@Romeos009) September 6, 2022