బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో వెనుకపడిన ఆస్ట్రేలియా తమ ఓటములకు భారత పిచ్లే కారణమంటూ నిందిస్తోంది. టీమిండియా తమకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయించుకుందంటూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టులు జరిగిన నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లపై ఐసీసీ ఇచ్చిన రేటింగ్స్ ఆసక్తికరంగా మారింది.
భారత జట్టుతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమవుతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా చేతుల్లో ఆ జట్టు చిత్తుచిత్తుగా ఓడింది. నంబర్ వన్ టెస్ట్ టీమ్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన కంగారూ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతోంది. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. అశ్విన్, జడేజా లాంటి అగ్రశ్రేణి స్పిన్నర్లను తట్టుకోలేక బ్యాట్లు ఎత్తేస్తున్నారు. అయితే తమ ప్లేయర్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీలు, అక్కడి మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నాగ్‌పూర్‌లోని తొలి టెస్టుకు ముందు పిచ్‌ను పరిశీలిస్తూ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులు చేసిన ఓవరాక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫస్ట్ టెస్ట్ ఆరంభానికి ముందు ఆసీస్ క్రికెట్.. ‘డాక్టర్ పిచ్’ అంటూ భారత్‌ను తక్కువ చేసేలా కామెంట్స్ చేసింది. టీమిండియా తమకు అత్యంత అనుకూలంగా ఉండేలా పిచ్‌ను తయారు చేసుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగియడం.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో టెస్టు కూడా దాదాపుగా ఇదే తరహాలో ముగియడం గమనార్హం. దీంతో పర్యాటక ఆస్ట్రేలియా టీమ్‌లో అసహనం తారస్థాయికి చేరుకుంది. అదే సమయంలో నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లకు మ్యాచ్ రిఫరీ, జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ యావరేజ్ రేటింగ్ ఇచ్చాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది.
ఐసీసీ రేటింగ్స్ ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమైంది. కొంతమంది ఆసీస్ క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు ఆరోపించినట్లుగా పిచ్ మరీ అంత చెత్తగా లేదని తేలిపోయింది. స్పిన్‌కు అనుకూలించేలా పిచ్‌లను రూపొందిచారని అంటున్న నేపథ్యంలో.. ఈ సిరీస్‌లో భారత ఆల్‌రౌండర్లు జడేజా– అక్షర్ పటేల్ కలసి 254 పరుగులు చేయడాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. జడ్డూ – అక్షర్లే ఇలా చెలరేగితే ఆసీస్ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేయడం వారి ఫెయిల్యూర్‌ను, స్పిన్ ఆడటంలో టెక్నిక్ లోపాన్ని చూపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పిచ్‌పై లేనిపోని నిందలు వేయడం మానేసి బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడం పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మరి.. ఇండియన్ పిచ్‌లపై ఆసీస్ నిందలు వేయడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.