టీ20 వరల్డ్ కప్ 2021 చివరి అంకానికి చేరుకుంది. ఇంకో మూడు మ్యాచ్‌లతో పొట్టి క్రికెట్ క్రికెట్ విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది. బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు ఇంటికి బయలుదేరుతుంది. ఇక మ్యాచ్‌లో తలపడనున్న జట్ల విజయావకాశాలను ఒక సారి పరిశీలిస్తే.. చరిత్ర ఇంగ్లండ్‌దే పైచేయిగా చెప్తుంది. సూపర్-12 దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త నిరాశ కలిగించినా.. తిరిగి పుంజుకునే సత్తా ఇంగ్లండ్‌కు ఉంది. కాగా ఇంగ్లండ్ జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా కండరాల నొప్పితో బాధపడిన స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లలో వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే స్టార్ పేసర్ టైమల్ మిల్స్ కూడా తొడ కండరాల గాయంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. సెమీస్ మ్యాచ్‌కు రాయ్, మిల్స్ దూరమవడం మోర్గాన్ సేనకు పెద్ద ఎదురు దెబ్బ. అయినా కూడా జొస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్‌లతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. రాయ్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బిల్లింగ్స్ కూడా హిట్టర్ అన్న విషయం తెలిసిందే.
మోర్గాన్ ఫామ్ అందుకుంటే ఇంగీష్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అలీ బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. పేసర్లు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు. కాగా జట్టులోని ఆటగాళ్లు గాయాలపాలవ్వడంతో జట్టులో కొంత అలజటి చోటు చేసుకుంది. ఈ అంశం న్యూజిలాండ్‌కు బాగా కలిసోస్తుంది అనడంలో సందేహం లేదు.
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే..
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో కివీస్ ఓడిపోయింది. దానికి బదులు తీర్చుకోవడానికి కివీస్ సేన కసిగా ఎదురుచూస్తుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, న్యూజిలాండ్ 2 మ్యాచులు గెలిచాయి. ఈ మ్యాచ్ గెలిచి ఈ లెక్కను కూడా సరిచేయాలని న్యూజిలాండ్ జట్టు పట్టుదలతో ఉంది. తీవ్ర ఒత్తిడిలోనూ కివీస్ గొప్పగా ఆడుతోంది. ఏ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడకుండా సమష్టిగా సత్తాచాటుతుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, దేవాన్ కాన్వే, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తున్నా.. కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం మాత్రం లేదు. ఒకరిద్దరు తప్ప మిగతావారందరూ పెద్దగా పరుగులు చేయడం లేదు.
ఈ టోర్నీలో దుర్భేద్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని న్యూజిలాండ్ గొప్పగా కట్టడి చేస్తోంది. సీనియర్ పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీతో పాటు ఆడమ్ మిల్నె, ఇష్ సోధి, మిచెల్ శాంట్నర్ పూర్తిస్థాయిలో రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లకు తమ పేసర్లతో చెక్ పెట్టేందుకు కివీస్ సిద్ధమైంది. మరి ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
జట్ల అంచనా..
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్, దేవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, ఆడమ్ మిల్నె.
ఇంగ్లండ్: జొస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్.