టీ20 వరల్డ్ కప్ 2021లో ఆదివారం జరిగే ఫైనల్‌తో పొట్టి క్రికెట్ విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ సాధించేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి. కాగా ఈ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొందరు కివీస్ కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం కచ్చితంగా ఆస్ట్రేలియానే గెలుస్తుందని అంటున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. గత రికార్డులు మాత్రం ఆస్ట్రేలియానే హాట్ ఫేవరెట్‌గా సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు ఐసీసీ మెగా టోర్నీల్లో 2 ఫైనల్స్, ఒక సెమీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు పోటీ పడగా.. మూడు సార్లు కూడా ఆసీస్ జట్టే పైచేయి సాధించింది.
2006లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో కివీస్‌ను ఆసీస్ మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రికీ పాంటింగ్(58), సైమండ్స్(58) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ కేవలం 46 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో పాటు ఫైనల్‌లోనూ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియానే ఎగరేసుకుపోయింది. అలాగే 2009 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు మరో సారి తలపడ్డాయి. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సాధారణ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో ఫినిష్ చేసింది.
ఇక 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా న్యూజిలాండ్ తన బ్యాడ్ రికార్డ్‌ను బ్రేక్ చేయలేకపోయింది. ఈ ఫైనల్‌లో న్యూజిలాండ్ కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. రాస్ టేలర్(40), గ్రాంట్ ఇల్లీయట్(83) తప్ప మిగతా ఆటగాళ్లంతా ఆసీస్ బౌలింగ్ ముందు తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఊదేసి.. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌లో ఐదో సారి విశ్వ విజేతగా అవతరించింది. ఇలా ఐసీసీ మెగా టోర్నీల్లో కివీస్‌పై తిరుగులేని రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా మరోసారి ఇదే పరంపరను కొనసాగించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియానే విజయం సాధించింది.
ఇక గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా కూడా.. ఈ సారి బ్లాక్‌క్యాప్స్‌ను ఓడించడం ఆసీస్‌కు అంత సులువు కాకపోవచ్చు. గ్రూప్ దశలో రెండు జట్లు కూడా 5 మ్యాచ్‌లలో 4 గెలిచి ఒక మ్యాచ్‌లో ఓటమి చూవిచూశాయి. సెమీస్‌లో.. ఇంగ్లండ్‌ను కివీస్, పాక్‌ను ఆసీస్ ఓడించి ఫైనల్‌కు చేరాయి. ఇక తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి గత రికార్డులను బట్టిచూస్తే ఆస్ట్రేలియానే ఫైనల్‌లో ఫేవరేట్‌గా కనిపిస్తుంది. చూడాలి మరి ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో? లేక న్యూజిలాండ్ చరిత్రను తిరగరాస్తుందో? ఏ జట్టు గెలిచినా కూడా ఒక కొత్త టీ20 ఛాంపియన్‌ను క్రికెట్ ప్రపంచం చూడబోతుంది. మరి ఏ జట్టు ఫైనల్‌లో విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.