భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ.. ఆమెపై 2 మ్యాచ్‌ల నిషేధం విధించింది.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా.. నిబంధనలను అతిక్రమించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. అంపైర్ నిర్ణయాన్ని బాహాటంగా తప్పుపట్టినందుకు గానూ.. ఆమె పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్‌తో చివరి వన్డే సందర్భంగా హర్మన్‌ప్రీత్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇరు జట్లు సమాన స్కోర్లు చేసిన ఆ మ్యాచ్ ‘టై’గా ముగియగా.. ఛేదనలో హర్మన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. అయితే అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన హర్మన్‌ప్రీత్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి కోపంగా పెవిలియన్ బాటపట్టింది. ఈ క్రమంలో అంపైర్‌తోనూ వాగ్వాదానికి దిగిన భారత సారథి.. మ్యాచ అనంతరం కూడా దీన్ని కొనసాగించింది.
హర్మన్ చర్యలపై భారత అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. మదన్‌లాల్ వంటి మాజీ ఆటగాళ్లు.. ఆమెపై నిషేధం విధించాల్సిందే అని పట్టుబట్టారు. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో బంగ్లాదేశ్ జట్టు సభ్యులతో హర్మన్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గట్లు లేదని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ హర్మన్ మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించిన విషయం తెలిసిందే. వికెట్లను కొట్టినందుకు 50 శాతం.. బంగ్లా ప్లేయర్లు, అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు 25 శాతం ఆమె మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా.. తాజాగా లెవల్-2 తప్పదింగా భావించిన ఐసీసీ.. హర్మన్‌కు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.
వికెట్లను కొట్టినందుకు గానూ 3 డీ మెరిట్ పాయింట్లు.. అంపైర్‌తో వాదించినందుకు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. దీంతో నిబంధనల ప్రకారం 24 నెలల కాలంలో 4 డీ మెరిట్ పాయింట్లు సాధించిన ప్లేయర్ పై ఒక టెస్టు లేదా 2 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (ఏవి ముందు జరిగితే అవి) నిషేధం పడుతుంది. బంగ్లాతో ఘటనలో ఒకేసారి హర్మన్ ఖాతాలో 4 పాయింట్లు చేరడంతో టీమిండియా ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్‌లకు హర్మన్ దూరం కానుంది. కాగా.. ఈ అంశంపై విచరాణ అవసరం పడలేదని.. హర్మన్ తన తప్పు అంగీకరించిందని ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వికెట్లను కొట్టినందుకు గానూ లెవల్-2 తప్పదానికి పాల్పడిన హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు 3 డీ మెరిట్ పాయింట్లు కేటాయించాం. అంపైర్ నిర్ణయాన్ని బాహాటంగా తప్పుపట్టడంతో 25 శాతం మ్యాచ్ ఫీజుతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ఆమె ఖాతాలో చేరింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 కింద ఈ చర్యలు తీసుకున్నాం’ అని ఐసీసీ వెల్లడించింది.
భారత మహిళల జట్టు సమీప భవిష్యత్తులో బరిలోకి దిగనున్న టోర్నీ ఆసియా గేమ్స్ కాగా.. అందులో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ సేవలను జట్టు కోల్పోనుంది. హర్మన్ గైర్హాజరీలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధన జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.
Harmanpreet Kaur has been reprimanded for a breach of the ICC Code of Conduct during the third #BANvIND ODI 😯https://t.co/3AYoTq1hV3
— ICC (@ICC) July 25, 2023