టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంతో ఇంటా.. బయట సర్వత్రా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలో నిలిచిన భారత్.. సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది. కర్ణడి చావుకు 100 కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. ప్రధానంగా భారత ఆటగాళ్లు ఐపీఎల్ మీద పెట్టిన శ్రద్ద ఐసీసీ టోర్నీల మీద పెట్టట్లేదు అన్నది ప్రధాన విమర్శ. ఇక ఓపెనర్ల విఫలం, సెమీస్ లో బయటపడ్డ బౌలింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడమే అని విండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్ కామెంట్ చేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో ఓటమికి ఇదే ముఖ్య కారణమని బిషప్ అభిప్రాయ పడ్డాడు.
రోహిత్ శర్మ.. అటు హిట్ మ్యాన్ గా, ఇటు టీమిండియా సారథిగా భారత్ కు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. అయితే గత కొన్నిరోజులుగా పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రోహిత్. కంటిన్యూస్ గా తక్కువ స్కోర్లు చేస్తూ.. జట్టుకు భారంగా మారుతున్నాడు. రోహిత్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణం అతడు కెప్టెన్ కొనసాగడమే అని విండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ చెప్పుకొచ్చాడు. గతంలో టీ20లకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీని.. తొలగించి ఆ పగ్గాలను రోహిత్ కు అప్పగించారు. అప్పటికే రెండు ఫార్మాట్స్ కు సారథిగా బాధ్యలు నిర్వహిస్తున్న రోహిత్ కు మరో బాధ్యత భుజాలపై పడింది. దాంతో అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బిషప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై తాజాగా ఇయాన్ బిషప్ మాట్లాడుతూ..”రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వయసులో టీ20లకు రోహిత్ ను సారథిగా చేసి టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది. ఐపీఎల్ లో ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించి విన్నర్ అనే కారణంగానే జట్టు పగ్గాలను అందించింది. కానీ ఇంటర్నేషన్ టీ20ల్లో మైదానంలో చురుగ్గా కదిలే కెప్టెన్ అవసరం. ఇకనైన టీ20 వరల్డ్ కప్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీ20లకు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ లలో ఎవరికో ఒకరికి జట్టు పగ్గాలు అందిస్తే బాగుంటుంది” అని ఇయాన్ బిషప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే గత కొంత కాలంగా ఇటు ఓపెనర్ గా, అటు సారథిగా విఫలం అవుతూ వస్తోన్న రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే మునుపటి ఫామ్ ను అందుకుంటాడని బిషప్ పేర్కొన్నాడు. టీ20లకు అనుభవంతో పాటు వయసును కూడా పరిగణంలో కి తీసుకోవాలని సూచించాడు బిషప్.