బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీమిండియా మాజీ క్రికెటరైన బిన్నీ.. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి వన్డే వరల్డ్ కప్ టీమ్ సభ్యుడు. బీసీసీఐ అధ్యక్షపదవి కోసం జరిగిన ఎన్నికల్లో రోజర్ తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బోర్డు నూతన అధ్యక్షుడిగా బీసీసీఐ సభ్యులు ప్రకటించారు. బుధవారం ముంబైలోని తాజ్ హోటల్‌లో జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన రోజర్ బిన్నీ రెండు కీలక విషయాలపై స్పందించారు.
ఆటగాళ్లు ఎందుకు గాయపడుతున్నారు..?
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన బిన్నీ.. తన ముందు రెండు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయని తెలిపారు. అందులో మరింత ముఖ్యమైనది ఆటగాళ్ల గాయాలు. గత కొంత కాలంగా టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాలపాలై.. వరల్డ్ కప్‌కు దూరం కూడా అయ్యారు. ఇలా అనేక సందర్భంల్లో ఆటగాళ్లు గాయాలతో ఆటకు దూరమయ్యారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గాయాల బెడద నుంచి టీమిండియాకు ఉపశమనం కలిగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని బీసీసీఐ కొత్త బాస్ బిన్నీ వెల్లడించారు.
కాగా.. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, జడేజా, షమీ కొంతకాలంగా గాయాలతో పలు సిరీస్‌లకు దూరం అయ్యారు. ఆటగాళ్లు ఇలా తరచు గాయాల పాలవ్వడానికి విశ్రాంతి లేని క్రికెటే అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. నిరంతరం అవిశ్రాంతంగా క్రికెట్ ఆడటం వల్లే ఆటగాళ్లు గాయపడుతున్నారని చాలా క్రికెట్ నిపుణులతో పాటు, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. దీనికి ఐపీఎల్ కూడా ఒక కారణమనే వాదన ఉంది. ఈ విషయంపై కూడా స్పందించిన బిన్నీ.. ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లతో మాట్లాడతానని అన్నారు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల ప్రాముఖ్యతను వారికి వివరించి.. తగిన విశ్రాంతి ఇచ్చేలా చూస్తానని బిన్నీ వెల్లడించారు. ఇక భారత్‌లోని పిచ్‌లపై కూడా దృష్టి సారించి మార్చులు చేస్తానని బిన్నీ పేర్కొన్నారు.
The new office bearers of BCCI ✅
Representatives in the IPL Governing Council ✅
Representative of the General Body elected in the Apex Council of the BCCI ✅ pic.twitter.com/BTvaGT2Otc
— BCCI (@BCCI) October 18, 2022