ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ టీమిండియా స్టార్ క్రికెటర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. అలాంటి క్రికెటర్‌ను తానింతవరకు చూడలేదని, వైట్‌బాల్ క్రికెట్(పరిమిత ఓవర్ల ఫార్మాట్ వన్డే, టీ20)లో అతనో అద్భుతమైన ఆటగాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. సాధారణంగా ఏ క్రికెటర్‌ను అంత త్వరగా మెచ్చుకోని పాంటింగ్.. టీమిండియా స్టార్‌ను మాత్రం.. సచిన్, లారాలను మించిన వాడిగా చెప్పుకొచ్చాడు. ఇంతకూ పాంటింగ్ మనసు గెలుచుకున్న ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు.. రన్‌మెషీన్, ఫీల్డింగ్‌లో జాంటీ రోడ్స్, టీమిండియా మాజీ కెప్టెన్.. కింగ్ కోహ్లీ. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడని, ఇలాంటి క్రికెటర్‌ను తానింత వరకు చూడలేదని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అతని రికార్డులే అతని గురించి చెబుతాయని, అన్‌బిలివబుల్ క్రికెటర్ అంటూ కొనియాడాడు.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న పాంటింగ్.. సోమవారం ఆస్ట్రేలియా-భారత్ మధ్య గాబా వేదికగా జరిగిన వామప్ మ్యాచ్‌లో కామెంట్రీ చేశాడు. ఈ సందర్భంగానే కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో పెద్దగా ప్రభావం చూపని కోహ్లీ.. తన ఫీల్డింగ్‌తో మ్యాచ్ మొత్తాన్ని మలుపుతిప్పాడు. ఒక అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేసి.. ఆ వెంటనే ఏ మాత్రం నమ్మశక్యం కానీ సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు అవుట్లతో ఆస్ట్రేలియా చేతుల్లో ఉన్న మ్యాచ్ కాస్తా.. టీమిండియా వశమైంది. ఈ విజయంలో కోహ్లీ ఫీల్డింగ్ కీలప పాత్ర పోషించింది.
ఇక వన్డే ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 262 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 253 ఇన్నింగ్స్‌ల్లో 57.68 సగటుతో 12,344 పరుగులు సాధించాడు. అందులో ఏకంగా 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీ20ల్లో 109 మ్యాచ్‌ల్లో 101 ఇన్నింగ్స్‌ల్లో 3712 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా వైట్ బాల్‌తో పాటు టెస్టు క్రికెట్‌లోనూ విరాట్ కోహ్లీ మంచి రికార్డులను కలిగి ఉన్నాడు. ఇటివల ఆసియా కప్‌లో సెంచరీతో మొత్తం మీద 71 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. సచిన్ 100 సెంచరీల తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీనే. అలాగే టీమిండియా తరఫున సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా విరాట్ కోహ్లీ. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీని బెస్ట్ అని పాంటింగ్ కితాబిచ్చాడు.
Video –https://t.co/vYxvftFhZI
— Cricket🏏 Lover (@CricCrazyV) October 17, 2022