ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌లో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలోనే ఉన్నా.. మూడో టెస్టులో ప్రదర్శన మాత్రం చాలా పేలవంగా సాగుతోంది. తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సిరాజ్ వికెట్లు, షమీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ చేసింది అభిమానులు ఇంకా మర్చిపోలేదు.
అదే జోష్‌లో మూడో టెస్టును కూడా చుట్టేస్తారనుకుంటే.. కథ అడ్డం తిరిగింది. గాలి ఇంగ్లాండ్ వైపు వీచింది. తొలిరోజే 78 పరుగులకే ఆలౌటై.. 42 పరుగుల ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు హమీద్(60*), రోరీ బర్న్స్(52) ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానుల్లో జోష్ శ్రుతి మించిపోయింది. ఆట గెలిచేలా ఉంటే ఉత్సాహంతో, ఓడేలా ఉంటే అసహనంతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొడతారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానులు. ఇప్పటికే అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. పెద్ద దుమారమే రేపాయి.
తాజాగా మూడో టెస్టు తొలి రోజు ఆట జరుగుతోంది. సిరాజ్ బౌండ్రీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. బౌండ్రీ దగ్గరుండే ప్లేయర్‌ని అభిమానులు ఆట పట్టించడం మామూలే. అదే ప్రత్యర్థి ఆటగాడైతే కాస్త డోసు పంచుతారు. అలా హైదారాబాద్ కుర్రాడు సిరాజ్‌ను హేళన చేయబోయి నోరు, చేయి కాల్చుకున్నారు.. ఇంగ్లాండ్ అభిమానులు. ఫీల్డ్‌లో ఉన్న సిరాజ్‌ని పిలిచి స్కోర్ ఎంత అని కేకలు వేశారు ఇంగ్లాండ్ అభిమానులు. దానికి బదులుగా సిరాజ్ వారి వైపు తిరిగి ప్రస్తుతానికైతే సిరీస్‌లో ‘1-0’ అని బదులిచ్చాడు. అంతే దెబ్బకి ఇంగ్లాండ్ అభిమానులు నోరెళ్ల బెట్టారు.