యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022 లో భారత జట్టు తన జోరును చూపిస్తోంది. మెున్న దాయాది జట్టైన పాక్ ను మట్టికరిపించిన ఇండియా.. తాజాగా పసికూన అయిన హాంకాంగ్ ను చిత్తు చేసింది. అనామక జట్టు అన్న పేరే కానీ హాంకాంగ్ మెుదట అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఇక ఆ ఒక్కడి రాకతోనే మ్యాచ్ స్వరూపం మెుత్తం మారిపోయిందని హాంకాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ అన్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రీడల్లో గెలుపోటములు సహజమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే మ్యాచ్ లకు సిద్ధం అవుతామని హాంకాంగ్ కెప్టెన్ అన్నాడు. ఇక ఇండియా పై ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో అతడు ఈ విధంగా మాట్లాడాడు.” మా బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారు. కానీ పట్టుని చివరి దాకా కొనసాగించడంలో వారు విఫలం అయ్యారు. చివరి ఓవర్లలో మా బౌలర్లు పట్టు తప్పి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అదీ కాక సూర్య కుమార్ క్రీజులోకి వచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అతడి ఆటను మేం చాలా ఆస్వాదించాం. సూర్యని కట్టడి చేయడంలో మేం పూర్తిగా విఫలం అయ్యాం అని నేను ఒప్పుకుంటున్నా. సగం ఓవర్ల వరకు మా జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచిందని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడటం చాలా గొప్ప విషయం. మా యువ ఆటగాళ్లకు ఇదో మంచి అనుభవంగా మేం భావిస్తున్నాం. ఈ మ్యాచ్ లో మా ఓటమిని శాసించింది మాత్రం సూర్యనే.. అంటూ అతడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఈ క్రమంలోనే మా బౌలింగ్ బలహీనతలను, ఓటమికి కారణాలను విశ్లేషించుకుని రాబోయే మ్యాచ్ కు సిద్ధం అవుతామని” నిజకత్ ఖాన్ వివరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్ లో కోహ్లీ 59 రన్స్ తో నాటౌట్ గా నిలువగా, సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి 40 రన్స్ తో పరాజయం పాలైంది. మరి ఈ మ్యాచ్ పై ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.