భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రవిడ్ అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మ్యాచ్ కావడంతో ఆయన టీమ్‌తోనే గడిపారు. ప్లేయర్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తూ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి ద్రవిడ్ పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో ఆయన బయల్దేరారు.
అస్వస్థత నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగే ఆఖరి వన్డేకు ద్రవిడ్ అందుబాటులో ఉండరని సమాచారం. మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నామమాత్రమైన చివరి వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఇక, రెండో వన్డేలో టీమిండియా ఆడిన తీరుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ జట్టు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చింది.
రెండో వన్డేలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటర్లు అదరగొట్టడంతో విక్టరీ కొట్టింది. ఛేజింగ్‌లో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కీలకమైన ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. హార్దిక్ అవుటైనా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో కలసి రాహుల్ టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మన ప్లేయర్లు ఇలాగే ఆడితే మూడో వన్డేలోనూ గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరి, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లేకపోవడం మూడో వన్డేలో భారత జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.