హ్యాట్రిక్‌ పై హర్షల్‌ పటేల్‌ స్పందన.. కోహ్లీకి థ్యాంక్స్‌ అంటూ..

ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌లో జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ కూడా అలాగే సాగింది. ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఘన విజయం అందుకోవడమే కాదు.. వారి బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌తో మెరిసాడు. రికార్డులు సృష్టించాడు. 17వ ఓవర్‌లో హర్షల్‌ మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 17వ ఓవర్‌ మొదటి బంతిని వైడ్‌గా వేసిన హర్షల్‌ తర్వాతి బంతికి పాండ్యా(3)ను ఔట్‌ చేశాడు. రెండో బంతికి పొరార్డ్‌(7)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మూడో బంతికి రాహుల్‌ చాహర్‌ను గోల్డెన్‌ డక్‌గా ఎల్బీడబ్ల్యూతో పెవిలియన్‌ చేర్చాడు. ఐపీఎల్‌ ఆర్సీబీ తరఫున ఈ ఫీట్‌ చేసిన మూడో బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ రికార్డుల కెక్కాడు. ఐపీఎల్‌ టోర్నీలో హ్యాట్రిక్‌ సాధించిన 20వ బౌలర్‌గా హర్షర్‌ నిలిచాడు.

కోహ్లీకి థ్యాంక్స్‌

హ్యాట్రిక్‌ సాధించడంపై హర్షల్‌ పటేల్‌ స్పందించాడు. హ్యాట్రిక్‌ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నా లైఫ్‌లో ఇది మొదటి హ్యాట్రిక్‌. నా స్కూల్‌ లైఫ్‌లో కూడా ఎప్పుడూ హ్యాట్రిక్‌ తీయలేదు. చాలా సార్లు నేను హ్యాట్రిక్‌ దగ్గరి దాకా వెళ్లాను కానీ సాధించలేకపోయాను. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అంటూ హర్షల్‌ పటేల్‌ చెప్పుకొచ్చాడు. కోహ్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గత సీజన్‌ నుంచి కోహ్లీ తనపై నమ్మకం ఉంచిన విషయాన్ని ప్రస్తావించాడు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు బౌలింగ్‌ ఇచ్చి అవకాశం కల్పించాడని చెప్పాడు. ప్రతి సందర్భంలో కోహ్లీ సపోర్టింగ్‌గా ఉన్నాడని.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు ఆనందంగా ఉందని హర్షల్‌ పటేల్‌ వ్యాఖ్యానించాడు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV