లెజెండరీ యాక్టర్, తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజం.. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కృష్ణ మృతితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. అలాగే ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోధ్వేగానికి గురయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కృష్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. వీరితో పాటు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సైతం కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘నా చిన్నతనం నుంచి మరొక పేరు వెళ్లిపోతుంది. తెలుగు స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్‌లతో పాటు కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్, మోహన్‌బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి వంటి వారితో చేసిన సినిమాలు గుర్తుండిపోతాయి. ప్రధానంగా దూరదర్శన్‌లో.’ అంటూ హర్ష భోగ్లే ట్వీట్ చేశారు. క్రికెట్ కామెంటేటర్, ఎనలిస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన హర్ష.. చిన్నతనం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది. ఆ సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ సినిమాలతో పాటు కృష్ణ, కృష్ణంరాజు వంటి వారి సినిమాలు చూస్తూ పెరిగారు హర్ష భోగ్లే. ఇప్పుడు కృష్ణ మృతితో తెలుగు సినిమాలతో ఆయనకున్న అనుబంధం, తెలుగు దిగ్గజ నటులను మరోసారి ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. హర్ష భోగ్లే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం కృష్ణ భౌతికకాయాన్ని ఆయన స్వగృహం నానక్‌రామ్ గుడలో ఉంచారు. అక్కడికి ప్రముఖులు వచ్చిన ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి సినీ ప్రముఖలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. కాగా.. రేపు మధ్యాహ్నాం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. అభిమానుల సందర్శనార్థం రేపటి వరకు అవకాశం కల్పించనున్నారు.
Another name from my childhood passes on. Telugu star Krishna. Apart from the trinity of NTR, ANR & SVR, remember movies with Krishna, Sobhan Babu, Chandramohan, Mohan Babu, Jaggayya, Gummadi, Relangi. Mainly on Doordarshan.
— Harsha Bhogle (@bhogleharsha) November 15, 2022