మహేంద్రసింగ్ ధోని సిగ్నెచర్ షాట్, ఆయన అభిమానుల ఫేవరేట్ షాట్ ఏంటంటే క్రికెట్ గురించి కూసింత నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఠకున్న చెప్పే సమాధానం ‘హెలికాఫ్టర్ షాట్’. కెరిర్ ప్రారంభంలో మహీ ఈ షాట్ ఎక్కువగా ఆడేవాడు. ఆ షాట్ ను ఆధారంగా చేసుకుని ఒక వ్యాపార ప్రకటన వెలువడిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ షాట్ కున్న క్రేజ్ ఏంటో. భారత జట్టు సారథి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆ షాట్ పెద్దగా ఆడలేదు. దానికి వెన్ను నొప్పి కూడా ఒక కారణం అయింది. అప్పుడప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ల్లో హెలికాఫ్టర్ షాట్ చూసేందుకు అవకాశం దక్కింది. అది ధోని బ్యాట్ నుంచి ధోనిని కాపీ కొట్టిన ఇతర బ్యాట్స్ మెన్ల నుంచి వచ్చింది. కొంతమంది ఆ షాట్ ఆడి అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి.
కానీ భారత స్టార్ ఆల్ రౌండర్, హార్డ్ హిట్టర్ హార్ధిక్ పాండ్యా అచ్చం ధోని షాట్ ను ధోనిలానే కొట్టాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ హంగామా యూఏఈలో మొదలవనుంది. దాదాపు అన్ని జట్లు అక్కడికి చేరుకుని అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ మొదలెట్టాయి. ముంబాయి ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాండ్యా ధోని హెలికాఫ్టర్ షాట్ అలవోకగా కొట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోని హెలికాఫ్టర్ షాట్ చూసే భాగ్యం ఎలాగూ తమకు లేదని, కనీసం తమ అభిమాన ఆడగాడు వదిలివెళ్లిన షాట్ ను ఎవరన్న ఆడితే చూసి ఆనందపడుతున్నారు ధోని అభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పిన మహీ, ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు.
మెంటర్ నుంచి మరిన్ని మెళుకువలు నేర్చుకోవచ్చు..
అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్పు 2021కి భారత జట్టును బుధవారం బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు ధోని మెంటర్ గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో హార్ధిక్ పాండ్యా సభ్యుడు. హెలికాఫ్టర్ షాట్ ను ప్రాక్టీస్ చేస్తున్న పాండ్యాకు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆ షాట్ కి గాడ్ అయిన ధోని సలహాలు సూచనలు లభిస్తాయి. దీంతో ఆ షాట్ పై మరింత పట్టు సాధించేందుకు పాండ్యాకు అవకాశం దక్కుతుంది. అదే గనక జరిగితే మరిన్ని హెలికాఫ్టర్ షాట్లను టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో చూడోచ్చు.