మరోసారి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఇది కదరా ఇండియా-పాకిస్థాన్ అంటే.. అనేలా చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఆసియా కప్ లీగ్ మ్యాచే అయినా.. ఏదో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లా అభిమానులకు క్రికెట్ మజాను పంచింది. ఓవర్ ఓవర్‌కు మ్యాచ్ మలుపు తిరుగుతూ.. ప్రేక్షకుల బీపీలను అమాంతం పెంచేసింది. చివరికి టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటూ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడినా అద్భుతంగా పోరాడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పరిస్థితి దృష్ట్యా పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్ట్రాంగ్ ఓపెనింగ్ జోడి బాబర్ అజమ్-మొహమ్మద్ రిజ్వాన్ పాక్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ రెండు బౌండరీలతో మంచి లయలో కనిపించాడు. కానీ.. టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన సీనియరిటీ పవరేంటో రుచిచూపించాడు. రోహిత్ శర్మ తెలివైన కెప్టెన్సీతో భువీ ఫలితం రాబట్టాడు. బాబర్ అజమ్(10)ను ఊహించని షార్ట్ పిచ్ బాల్‌తో అవుట్ చేశాడు.
ఇక్కడి నుంచి పాక్‌కు కష్టాలు మొదలు.. మరో ఓపెనర్ రిజ్వాన్ ఆచితూచి ఆడుతున్నప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఫకర్ జమాన్(10)ను అర్షదీప్ పెవిలియన్‌కు పంపిస్తాడు. పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఇక రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్(28) జోడీ క్రీజులో పాతుకుపోతున్న దశలో హార్దిక్ పాండ్యా బౌన్సర్లతో పాక్‌ను చావుదెబ్బ తీశాడు. ఇఫ్తికార్, ఖుష్‌దిల్ (2), రిజ్వాన్‌లను వెంటవెంటనే హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత భువీ పేస్‌కు మిడిలార్డర్ తలవంచింది. ఓ దశలో 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్.. ఆఖర్లో షానవాజ్ దహని 2 సిక్సులు, హారిస్ రౌఫ్ 2 ఫోర్లు బాదడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగుల చేసింది.
స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాకు పాక్ యంగ్ బౌలర్ నసీమ్ షా ఊహించని షాకిచ్చాడు. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ లేని లోటును తీరుస్తూ.. కెప్టెన్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఇన్నింగ్స్ రెండో బంతికే అవుట్ చేసి పాక్‌కు అద్భుతమై స్టార్ట్ ఇచ్చాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కింగ్ కోహ్లీ కూడా డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్లిప్‌లో ఫకర్ జమాన్ క్యాచ్ పట్టుకోలేకపోవడంతో బతికిపోయాడు. తర్వాత కోహ్లి నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడ్డా తర్వాత కుదురుకున్నట్లు కనిపించాడు.
జట్టు స్కోరు 50 పరుగులకు పూర్తి అయిన తర్వాత రోహిత్ శర్మ(18 బంతుల్లో 12; 1 సిక్స్), కాసేపటికే కోహ్లి భారీ షాట్లకు యత్నించి వికెట్లను పారేసుకున్నారు. ఈ దశలో జడేజా, సూర్యకుమార్ కాసేపు నిదానంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందకు నడిపించారు. అంతకంతకు రిక్వైర్డ్ రన్‌రేట్ పెరిగిపోతుండడంతో అడపాదడపా షాట్లు బాదారు. వేగం పెంచే క్రమంలో సూర్యకుమార్ (18 బంతుల్లో 18; 1 ఫోర్) వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి హిట్టర్ పాండ్యా వచ్చేసమయానికి 15 ఓవర్లు ముగిసి.. 4 వికెట్లు కోల్పోయిన భారత్ 97 పరుగులు చేసింది. అప్పటికే 30 బంతుల్లో 51 పరుగులు కావాలి. 16, 17వ ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. దీంతో విజయం కాస్త కష్టంగానే అనిపించింది. కానీ.. అప్పటికే నిప్పులు చెరుగుతున్న నసీమ్ షా వేసిన 18వ ఓవర్లో జడేజా ఫోర్, సిక్సర్ బాదాడు. తర్వాత రౌఫ్ ఓవర్‌లో పాండ్యా 3 బౌండరీలతో చెలరేగాడు.
ఇక చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 7 పరుగులు కావాలి.. సులువే కానీ… తొలి బంతికి నవాజ్ బౌలింగ్‌లో జడేజా బౌల్డ్ అయ్యాడు. తర్వాత రెండు బంతుల్లో వచ్చింది ఒకటే పరుగు. మిగిలిన 3 బంతుల్లో 6 పరుగులు చేయాలి. క్రికెట్ అభిమానులంతా టెన్షన్‌తో తలలుపట్టుకున్నారు. కానీ.. ఈ నరాలు తెగే ఉత్కంఠకు తెరదించుతూ హార్దిక్ పాండ్యా లాంగాన్‌లో భారీ సిక్స్ కొట్టి టీమిండియాకు మధురమైన విజయం అందించాడు. టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి టీమిండియా బదులు తీర్చుకున్నట్లు అయింది. కానీ.. టాస్ తమకు అనుకూలంగా రాకపోయినా.. మంచి పోరాటం చేసిన పాకిస్థాన్ టీమ్‌ను ఇండియన్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా మెచ్చుకోవడం విశేషం. టాస్ ఓడినా.. తక్కువ స్కోర్ చేసినా.. టీమిండియాకు అంత సులువుగా విజయాన్ని దక్కనివ్వకుండా చివరి వరకు అద్భుతంగా పోరాడిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుందంటూ మరి కొంత మంది పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన పాండ్యా, బ్యాటింగ్‌లోనూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాను గెలిపించడంతో అతని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మరి ఈ మ్యాచ్‌పై, పాండ్యా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘బాబర్ ఆజమ్.. అన్ని ఫార్మాట్లలోనూ టాప్ బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ!
Hardik Pandya is adjudged Player of the Match for his excellent all-round show as #TeamIndia win a thriller against Pakistan 👏🎉💥
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/D7GnzdFmQf
— BCCI (@BCCI) August 28, 2022
WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets 👏👏
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09
— BCCI (@BCCI) August 28, 2022