క్రికెట్ దేశ వ్యాప్తంగా.. అత్యంత ప్రజాధారణ ఉన్న ఆట. అందుకే ఏ చిన్న పిల్లడిని నీకు ఏ ఆటంటే ఇష్టం అంటే.. దాదాపు క్రికెట్ అనే చెబుతాడు. మరి ఇలాంటి ఆట.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్రాల క్రికెట్ సంఘాల వ్యవహారం రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘంపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరవకు ముందే.. మరో రాష్ట్ర క్రికెట్ సంఘంపై అక్రమాల మరకలు అంటుకున్నాయి.”BCCI రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని” టీమిండియా మాజీ క్రికెటర్ ఆమ్ ఆద్మి పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హర్భజన్ సింగ్.. టీమిండియా క్రికెట్ లో దుకుడుకు మారు పేరుగా నిలిచాడు. తన ఆటతోనే కాకుండా.. వివాదాలతో కూడా తరచూ వార్తల్లో నిలిచేవాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి సొంత రాష్ట్ర క్రికెట్ సంఘంపై మండిపడ్డాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు బహిరంగ లేఖ రాశాడు. ఈ లేఖలో భజ్జీ ఈ విధంగా స్పందించాడు..”ఇప్పుడున్న పీసీఏ చీఫ్ గుల్జారీందర్ చాహల్.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. బీసీసీఐ రాజ్యాంగాన్ని పీసీఏ పాటించడంలేదు. అదీ కాక ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లు.. గత కొన్ని రోజులుగా తనకు రాష్ట్ర క్రికెట్ ప్రేమికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అదీ కాక ఓటింగ్ హక్కుతో సుమారు 150 మందిని పీసీఏ లోకి సభ్యులుగా తీసుకోవడానికి చీఫ్ ప్రయత్నిస్తున్నట్లు అక్కడి వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇది బీసీసీఐ రాజ్యంగానికి విరుద్దం. సమావేశాలకు సైతం సభ్యులను పిలవడం లేదని భజ్జీ ఆరోపించాడు. ప్రస్తుతం భజ్జీ పీసీఏ లో చీఫ్ అడ్వైజర్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ ఆరోపణలపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.