ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్ చిహ్నాన్ని ప్రకటించింది. దీంతో క్రీడాలోకంతో పాటు, హనుమ భక్తులు ఆనంద పరవశంలో మునిగితేలుతున్నారు. విదేశాల్లో హనుమంతుడిని ఆరాదిస్తున్న తీరుకు ముగ్దులవుతున్నారు.
భారతదేశం గొప్ప సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇండియాలోని ఆచార వ్యవహారాలు, ప్రజలు అవలంభించే పద్దతులు ఆదర్శవంతంగా ఉంటాయి. భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకు విదేశీయులు ముగ్థులవుతున్నారు. కొందరు విదేశీయులు భారతదేశ సనాతన ధర్మాలను పాటిస్తున్నారు. భారతీయులు కొలిచే దేవుల్లను సైతం ఇతర దేశాల్లో వారి ఇష్ట దైవంగా భావించి గుడులు కట్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామ భక్తుడైన ఆంజనేయుడి చిహ్నాన్ని ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ కి అధికారిక చిహ్నంగా ప్రకటించారు. ధైర్యసాహసాలకు, బలానికి, నిజాయితీకి, భక్తికి, మానవత్వం వంటి సకల సద్గుణాలు ఉన్న హనుమంతుడిని ఆసియా అథ్లెటిక్స్ టోర్నీకి అదికారిక చిహ్నంగా ఎంచుకున్నారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం నుంచి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ జరుగనుంది. కాంటినెంటల్ గవర్నింగ్ బాడీ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎడిషన్ కు సంబందించి లార్డ్ హనుమాన్ చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 లోగో ఆటలలో పాల్గొనే అథ్లెట్ల నైపుణ్యాలు, అథ్లెట్ల జట్టుకృషి, ఆటపట్ల అంకితభావం మరియు క్రీడాస్ఫూర్తి యొక్క ప్రదర్శనను సూచిస్తుందని పేర్కొంది. కాగా భారత స్టార్ షాట్‌పుటర్ తాజిందర్‌పాల్ సింగ్ టూర్ మరియు లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ నేతృత్వంలోని భారత్, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లలో ప్రభావవంతమైన ప్రదర్శన చేయాలన్నా సంకల్పంతో ఉంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు థాయ్ లాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.