క్రికెట్‌లో కొంతమంది కొట్టే షాట్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. సచిన్ స్ట్రేట్ డ్రైవ్, కోహ్లీ కవర్ డ్రైవ్, ధోని హెలికాప్టర్ షాట్, యువరాజ్ సింగ్ ఫ్లిక్ షాట్, రోహిత్ శర్మ పుల్‌షాట్, సూర్యకుమార్ యాదవ్ స్విప్ షాట్.. ఇలా మన ఇండియన్ ప్లేయర్లలో దాదాపు ఒక్కొక్కరికి ఓ ప్రత్యేకమై షాట్ ఉంది. ఆ షాట్‌ను వారు తప్ప ప్రపంచంలో మరే ఆటగాడు కూడా అంత సొగసుగా ఆడలేడు. వాళ్లు ఆ షాట్లు ఆడుతుంటే.. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అయితే.. మీరు చూసిన ఈ షాట్ మాత్రం వాటికంటే కూడా ఎంతో ప్రత్యేకం. ఆ షాట్ ఆడింది.. మన టీమిండియా క్రికెటర్, మన తెలుగు కుర్రాడు హనుమ విహారి. సచిన్, కోహ్లీ, ధోని ఆడే స్పెషలిస్ట్ షాట్ల వెనుక టన్నుల కొద్ది టాలెంట్, స్టైలిష్ నెస్ దాగి ఉంటే.. విహారి ఆడిన ఆ ఒంటిచేతి షాట్ వెనుక భరించలేని నొప్పి, గెలవాలనే కసి దాగి ఉన్నాయి.
అదేదో సరదాగానో, లేక ఫీల్డింగ్ టీమ్‌ను డిస్టబ్ చేసేందుకో ఆడిన షాట్ కాదు. బాల్ తగిలి కుడి చేతి మణికట్టు విరిగితే.. జట్టును గెలిపించాలనే కసితో గాయమైనా తెగువ చూపిస్తూ.. లెఫ్ట్ హ్యాండ్ స్టాండ్ తీసుకుని.. ఒంటిచేత్తో ఆడిన షాట్. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఆంధ్ర-మధ్యప్రదేశ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విహారి ఈ తెగువ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ వేసిన బాల్.. విహారి కుడి చేతి మణికట్టుపై బలంగా తాకింది. దీంతో విహారి నొప్పితో విలవిల్లాడిపోయి.. మైదానం విడిచివెళ్లిపోయాడు. అప్పటి వరకు 323/2తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర.. 30 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. దాంతో విరిగిన చేతితోనే విహారి ఆఖరి వికెట్‌గా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.
16 పరుగులు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన విహారి మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి.. గాయమైన కుడిచేతిని వెనక్కి పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టాండ్ తీసుకుని.. ఎడమ చేతితో బ్యాటింగ్ చేసి మరో 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆంధ్ర 379 పరుగులకు ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్‌ను 228 రన్స్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసిన ఆంధ్ర బౌలర్లు.. మంచి ఆధిక్యం సాధించారు. కానీ.. తొలి ఇన్నింగ్స్‌లో విహారి చూపించిన పట్టుదలను అపహాస్యం చేస్తూ.. 93 రన్స్‌కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన విహారి మరోసారి లెఫ్ట్ హ్యాండ్‌తో 15 రన్స్ చేశాడు. అందులో 3 ఫోర్లు ఉన్నాయి. ఒక్క చేతితో ఫోర్ కొడుతుంటే.. ప్రపంచంలో ఇంత తెగువ చూపి బ్యాటింగ్ చేసే బ్యాటర్ ఉన్నాడా అని అనిపించింది.
అయితే.. గాయమైనా తాను బ్యాటింగ్ చేసేందుకు వస్తే.. జట్టులో గెలవాలనే పట్టుదల పెరుగుతుందని, ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు తాను లెఫ్ట్ హ్యాండ్‌తోనైనా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు విహారి తెలిపాడు. ప్రస్తుతం 245 పరుగుల లక్ష్యంతో మధ్య ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి వికెట్ కోల్పోకుండా 58 రన్స్ చేసి.. విజయం వైపు దూసుకెళ్తుంది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర బ్యాటర్లు విఫలం అవ్వడంతో విహారి కష్టానికి ఫలితం దక్కేలా లేదు. మరి ఈ మ్యాచ్‌లో విహారి చూపించిన పట్టుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM
— Teja Tanush (@Tejatanush1) February 2, 2023