ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ లోని ప్రారంభ మ్యాచులకు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు? ఏం జరిగింది?
మన దేశంలో ప్రతిఏటా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ని అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో పలు ఫ్రాంచైజీలకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గాయలు, వ్యక్తిగత కారణాలతో పలువురు స్టార్ ప్లేయర్లు టోర్నీకి, మ్యాచులకు దూరమవుతున్నారు. తాజాగా చెన్నై జట్టులోని జెమీసన్ గాయపడేసరికి సిసాండని తీసుకున్నారు. అంతకుముందు ఆర్సీబీలోని విల్ జాక్స్ గాయంతో తప్పుకొన్న కారణంగా బ్రేస్ వెల్ ని తీసుకున్నారు. ఇలా జరుగుతుండగానే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు ఓ స్టార్ ప్లేయర్ హ్యాండిచ్చాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తొలి సీజన్ లోనే కప్ కొట్టేసింది. కెప్టెన్, ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్య సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ జట్టులోని ఆటగాళ్లందరూ సమష్టిగా ఆడడంతో గతేడాది ట్రోఫీని ముద్దాడారు. త్వరలో ప్రారంభమయ్యే కొత్త సీజన్ లోనూ అదే ఊపు కొనసాగించాలని ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో కొన్ని మ్యాచులకు దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ స్వయంగా ప్రకటించాడు.
వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా జట్టు రెండు వన్డేలు ఆడనుంది. దీనికోసం మిల్లర్ తోపాటు ఐపీఎల్ లో పలు జట్లకు ఆడుతున్న సఫారీ ఆటగాళ్లు.. ప్రారంభ మ్యాచులకు దూరం కానున్నారు. సరిగ్గా ఐపీఎల్ స్టార్టింగ్ రోజున అంటే మార్చి 31న తొలి వన్డే జరగనుంది. ఏప్రిల్ 2న రెండో మ్యాచ్ ఉంది. ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ నకు అర్హత సాధించాలంటే ఈ రెండింటిలోనూ దక్షిణాఫ్రికా గెలిచి తీరాలి. ఇందుకోసమే సఫారీ ప్లేయర్లు.. వన్డే జట్టులో కచ్చితంగా ఉండి తీరాలని దక్షిణాఫ్రికా బోర్డు చెప్పుకొచ్చింది. గతేడాది కూడా సౌతాఫ్రికా ప్లేయర్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు జాన్సెన్, రబాడ, ఎంగిడి, మార్క్రమ్, డస్సెన్ తదితరులు ఐపీఎల్ కు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు మాత్రం అలా చేయలేదనిపిస్తోంది. మరి దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచులకు దూరం కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.