పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్రికెట్ పండగ.. ‘వన్డే ప్రపంచకప్’ ఆతిథ్యానికి భారత్ సిద్ధమైంది. అక్టోబర్-5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీని వీక్షించేందుకు మైదానాలకు రానున్న ప్రేక్షకుల కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం బోర్డు కార్యదర్శి జై షా వివరాలు వెల్లడించాడు. నెలన్నర పాటు సాగనున్న ఈ సుదీర్ఘ సమరాన్ని వీక్షించేందుకు మన దేశం నుంచే కాకుండా.. వివిధ దేశాల అభిమానులు రానున్న నేపథ్యంలో స్టేడియంలో ఫ్యాన్స్‌కు ఉచితంగా మంచినీళ్లు అందించే ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
లీగ్ దశలో 45 మ్యాచ్‌లో రెండు సెమీఫైనల్స్ ఒక మెగా ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 48 మ్యాచ్‌లు జరుగనున్న విశ్వ సమరంలో.. మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగనున్న లీగ్ దశలో ఒక్కో జట్టు.. మిగిలిన తొమ్మిది జట్లతో మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. మెగాటోర్నీలో భాగంగా అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశంలో జరుగనున్న ప్రపంచకప్‌లో మరోసారి మన జట్టు ట్రోఫీ పట్టాలని చూస్తుంటే.. ఆతిథ్యంలో తమకు తిరుగులేదని బీసీసీఐ నిరూపించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగాగానే ప్రేక్షకులకు ఉచితంగా మంచి నీళ్లు అందించాలనే యోచిస్తోంది.
ఇక వన్డే ప్రపంచకప్‌లో మెగా ఫైట్‌గా అభివర్ణిస్తున్న భారత్-పాకిస్థాన్ పోరు రీ షెడ్యూల్ అంశంపై కూడా అమిత్ షా స్పందించాడు. కన్ఫామ్‌గా చెప్పకున్నా.. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. ముందస్తు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా దాయాదుల సమరం జరగాల్సి ఉండగా.. అదే సమయంలో గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు జరగనుండటంతో.. సెక్యూరిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో మ్యాచ్‌ను ఒక రోజు ముందుకు జరుపనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు జై షా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి.