ఐపీఎల్ ప్రారంభం కాకముందే ఫ్రాంచైజీలను ఓ సమస్య ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అన్ని జట్లకు గాయాలబెడద ప్రధాన సమస్యగా మారింది. ఇంజ్యురీల కారణంగా ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ ఆటగాడు గాయంపై బాంబు పేల్చాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, అతడేం అన్నాడంటే..!
ఐపీఎల్ ప్రారంభానికి మరో వారం రోజులు కూడా లేదు. ఈ మెగా టోర్నీ ఆరంభం కోసం ప్రేక్షకులతో పాటు ప్లేయర్లు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గాయాల బెడద ఫ్రాంచైజీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇంజ్యురీల కారణంగా ఇప్పటికే కొంతమంది కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. మరికొంత మంది ఆడేది, లేనిది సందేహాస్పదంగా మారింది. అలాంటి లిస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరు కూడా వినిపిస్తోంది. స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్-2022 ముగిసిన అనంతరం గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమయ్యాడు మ్యాక్స్‌వెల్. మెల్బోర్న్లో ఓ పుట్టిన రోజు కార్యక్రమానికి వెళ్లిన అతడు.. యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో మ్యాక్సీ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ పూర్తయిన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు.
ఇటీవల భారత జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాక్స్‌వెల్ భాగమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా అతడు అందుబాటులోకి వచ్చాడు. అయితే, తాను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదంటూ బాంబు పేల్చాడీ ఆల్‌రౌండర్. ‘ఫర్లేదు, కాళ్లు బాగానే ఉన్నాయి. అయితే నూరుశాతం ఫిట్‌నెస్ సాధించాలంటే ఇంకొన్ని నెలలు పడుతుంది. ఏది ఏమైనా అంతా సజావుగా సాగి.. టోర్నీ మొత్తం బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఈసారి మ్యాక్సీ మెరుపులు చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కు.. మ్యాక్స్‌వెల్ తాజా కామెంట్స్‌తో భయం పట్టుకుంది. అతడికి గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటనే ఆందోళన ఆర్సీబీ అభిమానుల్లో మొదలైంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ టీమ్‌తో చేరిన మ్యాక్స్‌వెల్.. ప్రస్తుతం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే చాన్స్ వచ్చింది. అందులో అతడు 8 రన్స్ చేశాడు.