కరోనా.. గత కొన్నేళ్లుగా మానవ జాతిని వణికిస్తున్న ఈ మహమ్మారి అన్నీ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇందుకు క్రికెట్ ఏమి అతీతం కాదు. కరోనా కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ దేశాన్ని దాటి మరీ రెండు విడతలుగా జరిగింది. ఈ మహమ్మారి దెబ్బకే ఇప్పుడు టి-20 ప్రపంచ కప్ కూడా బయోబుల్ నడుమ జరగాల్సి వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు అన్నిట్లో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా ప్రభావం మాత్రం ఆటపై పడుతూనే వస్తోంది. తాజాగా నలుగురు ఇండియన్ క్రికెటర్స్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
నవంబరు 4 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే.., ఈ టోర్నీ ముందు ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. షామ్స్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి,సాయిరాజ్ పాటిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన ఈ నలుగురు ఆటగాళాల్ను ఐసోలేషన్ కి తరలించగా, మిగిలిన జట్టు షెడ్యూల్ ప్రకారం గౌహతికి చేరుకుంది. మరి.. టోర్నీకి ఇంకా కాస్త సమయం ఉండటంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.