టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే తండ్రిగా రెండోసారి ప్రమోషన్ పొందాడు. అతని భార్య రాధిక ధోపావ్కర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రహానే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. “ఈ ఉదయం రాధిక, నేను మా ప్రపంచంలోకి మగబిడ్డను ఆహ్వానించాం. రాధిక, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలుపుతున్నా..” అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
కాగా, రహానే తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పటికే ఒక కుమార్తె కూడా ఉంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఇంటి పక్కపక్కన ఉంటూనే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమాయణాన్ని నడిపారు. కాలేజీకి అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి ఎంచక్కా సినిమాలు, పార్కులు అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లు. అలా చేస్తూ.. చేస్తూ.. ఒకరోజు రాధికా తల్లి కంటపడ్డారు. ఆ సమయంలో తప్పించుకునే ప్రయత్నంలో రహానే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడు. ఈ విషయాన్ని రహానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సంఘటన తర్వాత రాధికా, రహానే తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలిసిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.