టీ20 వరల్డ్ కప్ 2022కు టీమ్‌ను ప్రకటించినప్పటి నుంచి.. సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు జట్లను ప్రకటించిన సమయంలో, ఆడుతున్న సమయంలోనూ ఇదే ప్రకంపనలు చెలరేగాయి. తాజాగా కొత్త ఏడాది 2023లో శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డేలకు కోసం జట్లను ప్రకటించిన తర్వాత కూడా సంజుకు అన్యాయం జరిగింది, బీసీసీఐ దారుణంగా పక్షపాత వైఖరి అవలంభిస్తోందంటూ.. మరోసారి సోషల్ మీడియా గరంగరం అవుతోంది. అయితే.. సంజు శాంసన్‌కు ఏ విధంగా అన్యాయం జరిగింది? జట్టు ఎంపికలో జరిగిన మార్పులు ఏమిటీ? సంజు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న ఆవేదన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 కోసం సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సంజు అభిమానులైతే ఏకంగా ప్రత్యక్ష ఆందోళనలకు సైతం దిగారు. వరల్డ్ కప్ తర్వాత సంజు శాంసన్‌ను న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసినా.. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు. అప్పుడు కూడా సంజుకు కావాలనే అన్యాయం చేస్తున్నారంటూ.. విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఫామ్‌లో లేకపోయినా రిషభ్ పంత్‌కు అవకాశాలు ఇచ్చారు కానీ.. సంజుకు మాత్రం ఆడే ఛాన్స్ ఇవ్వలేదంటూ క్రికెట్ పండితులు సైతం మండిపడ్డారు.
ఇక ఆ వెంటనే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మరో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం.. తొలి వన్డేలో సంజును ఆడించి.. మళ్లీ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ రెండు వన్డేలు కూడా పూర్తిగా జరగలేదు. అయితే. తొలి వన్డేలో భారత్ త్వరగా వికెట్లు కోల్పోయిన దశలో పార్టనర్‌షిప్ నెలకోల్పేందుకు సంజు 36 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా కూడా శాంసన్‌ను రెండో వన్డేకు పక్కన పెట్టాడు. ఆ తర్వాత.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సైతం సంజు శాంసన్‌ను ఎంపిక చేయలేదు. చెత్త ఫామ్‌లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌తో పాటు పంత్‌ను ఎంపిక చేశాడు. అయితే గాయం కారణంగా పంత్ సిరీస్ నుంచి తప్పుకున్నా.. అతని స్థానంలో ఎవరీ ఎంపిక చేయలేదు. చివరి మ్యాచ్‌లో రోహిత్ ఆడకపోవడంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించారు.
ఇప్పుడు తాజాగా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్లలో సంజును కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు. అయితే.. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సంజు శాంసన్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకుండా టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడం వెనుక అర్థం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే సంజును వన్డేలకు దూరం చేసి.. వన్డే వరల్డ్ కప్‌కు పరిగణంలోకి తీసుకోవడంలేదని ఇప్పుడే తేల్చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు టీ20 వరల్డ్ కప్‌కు దూరం చేసి.. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు ముందు సంజును టీ20లకు ఎంపిక చేసి ప్లాన్ ప్రకారమే వన్డేలకు దూరం చేస్తున్నారంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌కు ఇన్ని అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సంజుకు మాత్రం ఎందుకు ఛాన్స్ ఇవ్వడంలేదని అంటున్నారు. మరి సంజును కేవలం టీ20 సిరీస్‌కే ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Selected 2 to 7 and Left out No 1, @BCCI for you. @bhogleharsha @irbishi @ShashiTharoor #INDvsSL #IndianCricketTeam #SanjuSamson pic.twitter.com/qkIvvMfXjE
— Jijesh (@jijesh__p) December 28, 2022