భారత్-ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి మూడు రోజులు పైచేయి సాధించిన భారత్.. విజయం సాధించేలా కనిపించింది. కానీ.. నాలుగురోజు ఇంగ్లండ్ మ్యాచ్ మొత్తాన్ని తమవైపు తిప్పుకుంది. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై ట్రోలింగ్‌కు దిగింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-బెయిర్‌స్టో మధ్య వాగ్వాందం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ మూడో రోజు ఈ ఘటన జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. మహ్మద్ షమీ ఓవర్లో ఈ ఘటన జరిగింది. షమీ బాల్ వేయగా అది కాస్త బౌన్స్ అయ్యింది. ఆ బాల్ తర్వాత పిచ్‌ని చూస్తూ బెయిర్ స్టో ఏదో కామెంట్ చేసినట్లు కనిపించాడు. ఆ తర్వాత కోహ్లీ కలగజేసుకుని ఏదో మాట్లాడాడు. అందుకు బెయిర్ స్టో కూడా సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ నోటిపై వేలు వేసుకుని నోరు మూసుకుని ఆట ఆడు అంటూ బెయిర్ స్టోకి చూపించాడు.
అనంతరం అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే బౌన్సర్ వేశాక షమీని బెయిర్ స్టో కామెంట్ చేయబట్టే కోహ్లీ స్పందించినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లీ- బెయిర్ స్టో నవ్వుకుంటూ భుజాలపై చేతులు వేసుకుని కనిపించారు. కానీ మూడో రోజు మాత్రం ఇద్దరు గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి కోహ్లీపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్రోలింగ్‌కు దిగింది. గొడవ సందర్భంలో విరాట్ కోహ్లీ నోటిపై వేలు వేసుకుని.. నోరు మూసుకో మని చూపిస్తున్న ఫొటోను, మ్యాచ్ ముగిసిన అనంతరం బెయిర్‌స్టోను అభినందిస్తున్న ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్టు చేసింది. దానికి నోటికి జీప్ వేసిన ఎమోజీని జోడించింది.
దీంతో ఎవరూ నోరు మూసుకోవాలో తెలిసిందా అంటూ కోహ్లీని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్రోల్ చేసినట్లు అర్థం వస్తుందని ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్రికెట్ బోర్డుల అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్ల నుంచి ఇలాంటి పోస్టులు చేయడం సరైన పద్దతి కాదని కామెంట్ చేస్తున్నారు. ఆటలో భావోద్వేగాల మధ్య జరిగే సంఘటనలను వాడుకుని ఆటగాళ్లను హేళన చేయడం, అవమానించడం కరెక్ట్ కాదని క్రికెట్ అభిమానులు సైతం హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— England Cricket (@englandcricket) July 5, 2022